Begin typing your search above and press return to search.

బాలయ్యకు వ్యతిరేకంగా దున్నపోతులతో నిరసన

By:  Tupaki Desk   |   19 April 2017 8:16 AM GMT
బాలయ్యకు వ్యతిరేకంగా దున్నపోతులతో నిరసన
X
అనంత‌పురం జిల్లా హిందూపురం... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్ అగ్ర‌హీరోగానే కాకుండా, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు కుమారుడిగా - అక్క‌డి ప్ర‌జ‌లు మొన్న‌టి ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన నంద‌మూరి బాల‌కృష్ణ గుర్తుకు వ‌చ్చేస్తారు. ఏనాడూ హిందూపురం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌ని బాల‌య్య‌ను... కేవ‌లం ఎన్టీఆర్ కుమారుడ‌న్న ఒకే ఒక్క కార‌ణంతో అక్క‌డి ప్ర‌జ‌లు అత్య‌ధిక మెజారిటీతో గెలిపించారు. అయితే ఆ త‌ర్వాత కొంత కాలం పాటు స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను బాగానే చూసుకున్న బాల‌య్య‌... ఇటీవ‌లి కాలంలో ఆ దిశ‌గా దృష్టి సారించిన దాఖ‌లాలు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

అంతేకాకుండా బాల‌య్య పీఏ హోదాలో ఎంట్రీ ఇచ్చిన శేఖర్ అనే వ్య‌క్తి మొన్నిటికి మొన్న అక్క‌డ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ గొడ‌వ‌ను స‌ద్దుమ‌ణిగేలా చేయ‌డానికి బాల‌య్య‌తో పాటు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు - బాల‌య్య అల్లుడు నారా లోకేశ్ నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది. ఈ వివాదం నేప‌థ్యంలో బాల‌య్య హిందూపురం వైపు చూసేందుకే ఇష్ట ప‌డ‌టం లేద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఇదే స‌మ‌యంలో వేస‌వి కాలం రావ‌డం, ఎండ‌లు ముదిరిన నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో తాగునీటి ఎద్ద‌డి తీవ్ర రూపం దాల్చింది.

టీడీపీ శ్రేణులు ఈ దుస్థితిని పంటి బిగువునే భ‌రిస్తూ వ‌స్తుండ‌గా... చిక్కిన అవ‌కాశాన్ని చ‌క్క‌గా వినియోగించుకున్న వైసీపీ శ్రేణులు నేటి ఉద‌యం అక్క‌డ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగాయి. బాల‌య్య‌కు వ్య‌తిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ... వైసీపీ శ్రేణులు రోడ్డెక్క‌డంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వైసీపీ శ్రేణుల‌ను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు త‌మ లాఠీల‌కు ప‌ని చెప్పారు. అయినా వెన‌క్కు త‌గ్గ‌ని వైసీపీ శ్రేణులు... బాల‌య్య‌కు వ్య‌తిరేకంగా చేస్తున్న నినాదాల హోరును మ‌రింతగా పెంచేశారు.

ఈ ఆందోళ‌న‌లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలో తాగునీటి ఎద్ద‌డిని ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను మ‌రిచిన బాల‌య్య‌ను దున్న‌పోతుగా పోల్చేసిన వైసీపీ శ్రేణులు... ఓ దున్న శ‌రీరంపై బాల‌య్య పేరును రాసి, ఆ ప‌క్కనే బాల‌య్య‌కు వ్య‌తిరేకంగా నినాదాలు రాసి మ‌రీ వినూత్న నిర‌స‌న‌కు దిగారు. ఇటీవ‌లే చంద్ర‌బాబు కేబినెట్లో చేరిన బాల‌య్య అల్లుడు నారా లోకేశ్... గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న శాఖ‌కు సంబంధించిన అంశంపై త‌న మామ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే నిర‌స‌న‌లు పెల్లుబక‌డం ఇటు లోకేశ్ తో పాటు అటు బాల‌య్య‌ను ఇర‌కాటంలో ప‌డేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/