Begin typing your search above and press return to search.

జగన్ని పొగుడుతూనే : వైసీపీలో ఇలాంటి నేతలు ఉంటే ఆలోచించాల్సిందే...?

By:  Tupaki Desk   |   10 July 2022 11:07 AM GMT
జగన్ని పొగుడుతూనే : వైసీపీలో ఇలాంటి నేతలు ఉంటే ఆలోచించాల్సిందే...?
X
పొగడడం అన్నది మా హక్కు అంటారు రాజకీయ నాయకులు. తమకు అధికారం ఇచ్చి కుర్చీలో కూర్చోబెడితే అధినాయకుడిని పొగడడంలో వారిని మించిన వారే ఉండదు. అదే నాయకుడు ఏ కారణం చేతనైనా పదవిని తీసుకుంటే మాత్రం వీరే రెచ్చిపోతారు. ఇది అత్యంత సహజం. ఇవన్నీ ఇలా ఉంటే సొంత పార్టీ నాయకుడిని పొగుడుతూనే ఇరకాటంలో పెట్టడంలో వైసీపీలో అతి నాయకుల బ్యాచ్ ఆరితేరిపోయింది అని అంటున్నారు. ఇదంతా సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట.

ప్లీనరీ వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్లీనరీలో మంత్రులు, మాజీ మంత్రులు కొందరు మాట్లాడిన మాటలు అయితే ఏ మాత్రం అతికీ అతకకుండా ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు అతి చేస్తూ వారు నోటి దూకుడు చేశారని, ఫలితంగా తమ అధినాయకుడు జగన్నే ఇండైరెక్ట్ గా కార్నర్ చేశారని కార్యకర్తలు మధనపడుతున్నారు.

నిజానికి జగన్ పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. ఆయన మీద సీబీఐ కేసులు ఉన్నాయి. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ విషయాన్నికి పదే పదే చెబుతూ విపక్షాలకు సవాళ్ళు చేస్తూ తమ నాయకుడి పరువు తీశారు అన్నదే కార్యకర్తల మాటగా ఉంది. జగన్ మీద అవినీతి కేసులు ఉన్నాయి. ఆయన జైలు జీవితం గడిపారు. అయినా ఈ రోజుకీ ఆయన్ని ఏం చేశారు, ఏం పీకారు అంటూ కొందరు మంత్రులు, మాజీ మంత్రులు ప్లీనరీ వేదికగా విపక్షాలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఎదురుతన్నాయని అంటున్నారు.

ఈ సందర్భంగా వారు చెప్పదలచుకున్నది ఏమైనా కానీ జగన్ అవినీతి చేసినా ఏమీ చేయలేని అసమర్ధత విపక్షాలది అని చెప్పినట్లుగా ఉందని అంటున్నారు. ఇక సందర్భం లేకపోయినా జగన్ జైలు గురించి కేసుల గురించి ప్రస్తావించి మరీ అభాసుపాలు చేశారని కూడా కార్యకర్తలు విశేషిస్తున్నారు.

జగన్ ఎక్కడా తగ్గడు అని చెబుతూ ఎవరి మాట వినడు అంటూ ఆయన్ని జనం దృష్టిలో మొండి వారిగా, నియంతగా మరికొందరు నేతలు ఆవిష్కరించారు. ఇక జగన్ సింహం సింగిల్ గా వస్తుందని, గడ్డి తనదని ఇంకో నేత అంటూ ఆయన ప్రత్యర్ధులను వేటాడేస్తారు అని చెప్పడం ద్వారా మరీ క్రూరంగా అభివర్ణినేందుకు సైతం వెనకాడలేదు.

ఇదంతా జగన్ వద్ద మార్కులు కొట్టే క్రమంలో నేతలు నోటికి పని చెప్పిన వైనంగానే చూడాలి. అంబటి రాంబాబు, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా. జోగి రమేష్ వంటి నాయకులు జగన్ గురించి మాట్లాడుతున్నపుడు వారు నిజంగా పొగడాలని చూసినా వారి అతి వల్ల అవి రివర్స్ అవుతున్న సంగతిని గమనించలేకపోయారు అని కూడా అంటున్నారు.

ఈ రోజుకీ వైసీపీ మీద జగన్ మీద జనాలలో నమ్మకం ఉంది. జగన్ వరకూ చూస్తే ఆయన పొల్లు మాటలు ఎక్కడా మాట్లాడరు, ఆయన సహనంతో ఉంటారు. ఆయన అసభ్య పదజాలం అసలు ఉపయోగించరు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ చుట్టూ కొంతమంది అతి నాయకులను ఉంచుకుని జగన్ కోరి చెడ్డ చేసుకుంటున్నారు అన్న మాట మాత్రం సొంత పార్టీలోనే ఉంది. ఈ నాయకులు ఒకటి అని నాలుగు విపక్షాల నుంచి పార్టీ అధినాయకుడు తినేలా చేస్తున్నారు అని కూడా అంటున్నారు.

మరి ఇలాంటి నాయకుల విషయంలో జగన్ ఆలోచించుకోవాలని కూడా సూచిస్తున్నారు. ప్రజలు ప్రతీ విషయం గమనిస్తారు అని అంటున్నారు. వారికి ఏమీ తెలియదు అనుకుంటే అంతకంటే పొరపాటు వేరొకటి లేదు అని అంటున్నారు. ఇలా అతి చేసిన వారి వల్ల గతంలో కొన్ని పార్టీలు ఇబ్బందులు పడ్డాయని, ఇపుడు వైసీపీలో కూడా కొందరు నేతలను కట్టడి చేసి వారి నోటికి తాళం వేయ‌కపోతే మాత్రం కచ్చితంగా వైసీపీ పుట్టె మునగడం ఖాయమే అన్న సూచనలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి.