Begin typing your search above and press return to search.

మంత్రి పదవికి పిల్లి రాజీనామా..సీఎం హామీ ఇదే!

By:  Tupaki Desk   |   28 Jan 2020 12:44 PM GMT
మంత్రి పదవికి పిల్లి రాజీనామా..సీఎం హామీ ఇదే!
X
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేసి - కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఏపీలో గత కొన్నిరోజులుగా మూడు రాజధానులపై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అభివృద్ధి వికేంద్రీకరణ అని జగన్ సర్కార్ చెప్తుంటే .. టీడీపీ మాత్రం ఒకే రాష్ట్రం ..ఒకే రాజధాని అది అమరావతే అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల ఏర్పాటుకి వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల బిల్లు పెట్టి ఆమోదించింది. కానీ ప్రతిపక్ష టీడీపీకి మండలిలో బలం ఎక్కువగా ఉండడంతో బిల్లు పాస్‌ కాలేదు. దీనితో అసెంబ్లీ లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మండలి లో బలం లేకపోవడం తో బిల్లు తిరస్కరణకు గురైంది అన్న భావనతో ..అసలు పెద్దల సభ అంటే విలువైన సలహాలు - సూచనలు ఇవ్వాల్సింది పోయి - ప్రజల చేత ఎంపిక కాబడి అసెంబ్లీ లోకి అడుగుపెట్టిన వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ..అసలు మండలి ఎందుకు అని అలాగే ఈ నేపథ్యంలో మండలి కొనసాగించడం కూడా అనవసర ఖర్చు అంటూ సభలో తీర్మానం పెట్టి ఆమోదం తెలిపి .. కేంద్రానికి పంపారు.

ఇకపోతే , ప్రస్తుతం వైసీపీ నుండి మండలిలో 9 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఇద్దరు జగన్ క్యాబినెట్ లో మంత్రులుగా కూడా ఉన్నారు. వారిలో ఒకరు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌‌ కాగా , మరొకరు మంత్రి మోపిదేవి వెంకటరమణ. ఇప్పుడు ఈ మండలి రద్దు జరిగితే ఈ ఇద్దరు కూడా మంత్రి పదవులు కోల్పోవాల్సి వస్తుంది. అలాగే కాంగ్రెస్‌ నాయకురాలు రత్నాబాయి - బీజేపీ నుంచి సోము వీర్రాజు తమ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా మండలి రద్దుతో ఆ పార్టీలకు నష్టమేనని చెప్పాలి. ఇక ఉపాధ్యాయ - పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఇద్దరూ వామపక్షాల ప్రతినిధులే కొనసాగుతున్నారు. ఇప్పుడు వామపక్షాల నుంచి ప్రాతినిధ్యం సభలో కోల్పోయినట్టే.

ఇకపోతే , ఈ ఇద్దరికి ఇంకా ఎమ్మెల్సీ గా పదవి కాలం ఉన్నప్పటికీ కూడా మండలి రద్దును అధికార పార్టీనే ప్రతిపాదించి అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో మంత్రులుగా ఈ ఇద్దరూ కొనసాగితే నైతికంగా పార్టీకి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు అని అధినేత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరితో మంత్రి పదవులకి రాజీనామా చేయించాలని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం జరిగిన కేబినేట్‌ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అలాగే వారు రాజీనామా చేసిన తరువాత - వారికీ మరో పదవి ఇచ్చి తగిన న్యాయం చేస్తాను అని సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బోస్‌ కి రాజ్యసభ సీటు ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఒకవేల రాజ్యసభ సీటు కుదరకపోతే - త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ మండళ్లలో కేబినేట్‌ ర్యాంకుకు సమానంగా వైస్‌ చైర్మన్‌ పోస్టు ఇవ్వడానికి సీఎం ఆలోచిస్తున్నారు అని తెలుస్తుంది.