Begin typing your search above and press return to search.

ఆ జ‌న‌సేన ముఖ్య నేత‌పై వైఎస్సార్సీపీ దృష్టి సారించిందా?

By:  Tupaki Desk   |   14 July 2022 8:00 AM IST
ఆ జ‌న‌సేన ముఖ్య నేత‌పై వైఎస్సార్సీపీ దృష్టి సారించిందా?
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోమారు గెలుపు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ వ్యూహ‌, ప్ర‌తి వ్యూహాలు ప‌న్నుతోంది. ఇందులో భాగంగా ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల్లో బ‌ల‌మైన నేత‌ల‌పై దృష్టి సారించింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో భాగం గానే జ‌న‌సేన పార్టీ పై కూడా దృష్టి సారించింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా జ‌న‌సేన పార్టీ ప్ర‌భావం కొంచెం ఎక్కువ ఉండే ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌పై వైఎస్సార్సీపీ అధిష్టానం దృష్టి సారించింద‌ని అంటున్నారు.

ఇందులో భాగంగా రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన పార్టీ కీల‌క నేత‌గా ఉన్న కందుల దుర్గేష్ పై వైఎస్సార్సీపీ దృష్టి సారించింద‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గం చోటా నాయకుల్లో జోరు గా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఉన్నారు. 2014 లోనూ బుచ్చ‌య్య చౌద‌రే గెలుపొందారు. 2009 లో టీడీపీ నుంచి చంద‌న ర‌మేష్ గెలిచినా బొటాబొటి మెజారిటీతో గెలిచారు. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన ర‌వ‌ణం స్వామి నాయుడు చంద‌నకు గ‌ట్టి పోటీ ఇచ్చి కేవ‌లం 1500 ఓట్ల‌తో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కొడుకు చందన నాగేశ్వర్ రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ కోర్డినేటర్ గా ఉన్నారు . ఇక 2019లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన కందుల దుర్గేష్ 42 వేల‌కు పైగా ఓట్లు సాధించారు. దాదాపు 23 శాతం ఓట్లు కందుల దుర్గేష్ సాధించారు.

కందుల దుర్గేష్ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీలో టాప్-3 నాయకుల్లో ఒక‌డిగా ఉన్నారు. అంతేకాకుండా తూర్పు గోదావ‌రి జిల్లా జ‌న‌సేన పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కాగా గ‌త రెండు ప‌ర్యాయాలు అంటే 2014, 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆకుల వీర్రాజు రాజ‌మండ్రి రూర‌ల్ లో ఓడిపోయారు. ఆయ‌న అంత క్రియాశీలకంగా ఉండ‌టం లేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ కందుల దుర్గేష్ పై దృష్టి సారించింద‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతోంది.

కందుల దుర్గేష్ వైఎస్సార్సీపీ లోకి వ‌స్తే ఇప్పుడే నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ గా ప్ర‌క‌టించ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేది కూడా ఆయ‌నే అని ప్ర‌క‌టిస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్టు జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేకాకుండా ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు మొత్తం ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్టు నియోజ‌క‌వర్గం లో కాపు నాయకులు చ‌ర్చించుకుంటున్నారు.

అయితే ఈ ఆఫ‌ర్ ను కందుల దుర్గేష్ సున్నితంగా తిర‌స్క‌రించార‌ని చెబుతున్నారు. జనసేన తో పాటే నా ప్రయాణం అని చెప్పారు అని అంటున్నారు . వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కందుల దుర్గేష్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించారు. కందుల దుర్గేష్ వైఎస్సార్సీపీ లో చేర‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోతే మాజీ ఎమ్మెల్యే చంద‌న ర‌మేష్ కుమారుడు చంద‌న నాగేశ్వ‌ర‌రావును వైఎస్సార్సీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దించాల‌నే ఆలోచ‌న‌లో ఆ పార్టీ అధిష్టానం ఉంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కానీ పోటీ చేసే అభ్య‌ర్థి ఎవ‌రో స్ప‌ష్ట‌త రాదు. అప్ప‌టిదాకా వేచిచూడాల్సిందే.