Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మూసివేత.. అయినప్పటికీ

By:  Tupaki Desk   |   20 July 2020 4:00 PM IST
కరోనా ఎఫెక్ట్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మూసివేత.. అయినప్పటికీ
X
మొన్నటి వరకూ కట్టడి ఉన్నట్లు కనిపించిన పాజిటివ్ కేసులు ఏపీలో ఇప్పుడు అధికమయ్యాయి. ఊహించని రీతిలో రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేనంతగా నిత్యం వేలాది కేసులు నమోదుకావటం సంచలనంగా మారింది. శనివారం రికార్డుస్థాయిలో రెండున్నరవేల కేసులు నమోదు కాగా.. ఆదివారం ఏకంగా ఐదు వేలకు పైగా కేసులు నమోదు కావటంతో అధికార వర్గాల్లో కలకలంగా మారింది.

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎందుకిలా జరుగుతోంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేసుల సంఖ్య పెరగటమే కాదు.. అనూహ్యంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో.. మొన్నటివరకూ జాగ్రత్తలు తీసుకుంటున్న వారు సైతం.. ఇప్పుడు మరింత అప్రమత్తం అవుతున్నారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇప్పటివరకూ సాగించిన వ్యవహారశైలిని మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మూసివేయలాని నిర్ణయించారు.

వారం రోజుల పాటు పార్టీ కార్యాలయాన్ని మూసి ఉంచాలని పార్టీ నగర కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం నిర్ణయించారు. పార్టీ కార్యాలయం మూసివేత తాత్కాలికమేనని.. అయినప్పటికీ ఏదైనా అవసరమైతే ఫోన్లో సంప్రదించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని రీతిలో శనివారం ఒక్కరోజులోనే తూర్పుగోదావరి జిల్లాలో 1132 కేసులు నమోదు కావటమే కాదు.. పన్నెండు మరణాలు చోటు చేసుకున్నాయి.

మార్చి నుంచి పాజిటివ్ కేసులు నమోదువుతున్నా.. ఇంత భారీగా.. ఒక్కరోజులో పదకొండువందల కేసులు రాష్ట్రంలోని మరే జిల్లాలో చోటు చేసుకున్నది లేదు. గడిచిన వారంలో భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. పార్టీ ఆఫీసును మూసి ఉంచాలని డిసైడ్ చేశారు.