Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ని ఓడిస్తే చాలు!... గ్రంథికి మంత్రి గిరీ గ్యారెంటీ!

By:  Tupaki Desk   |   20 March 2019 11:00 PM IST
ప‌వ‌న్‌ని ఓడిస్తే చాలు!... గ్రంథికి మంత్రి గిరీ గ్యారెంటీ!
X
ఏపీలో పొలిటిక‌ల్ హీట్ బాగా పెరిగిపోయింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన నాటి నుంచే ఈ హీట్ పెరిగినా... ఇప్పుడు నోటిఫికేష‌న్ రావ‌డం, మ‌రో నాలుగు రోజుల్లో నామినేష‌న్ల‌కు గ‌డువు ముగియ‌నుండ‌టంతో అంద‌రూ ఎన్నిక‌ల గురించే చ‌ర్చించుకుంటున్న ప‌రిస్థితి. అంతేనా ఈ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి విజ‌యం ద‌క్కుతుంది? త‌మ ప్రాంతంలో ఏ అభ్య‌ర్థికి గెలుపు అవ‌కాశాలున్నాయి? ఓడిపోయే అభ్య‌ర్థికి దెబ్బ‌కొట్టే అంశాలేమిటి? అన్న కోణంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఏపీలో ఇప్ప‌టిదాకా ద్విముఖ పోటీ జ‌రుగుతుంద‌న్న వాద‌న వినిపిస్తున్నా... అదిప్పుడు త్రిముఖ పోటీగానే మారిపోయింద‌ని చెప్పాలి. నిన్న‌టిదాకా సైలెంట్ గానే ఉండిపోయిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్... చివ‌రి నిమిషంలో చ‌క్రం తిప్పే దిశ‌గా నిర్ణ‌యాలు తీసుకుంటున్న వైనంతోనే ఈ కొత్త చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఇలాంటి త‌రుణంలో వైసీపీకి చెందిన ఓ అభ్య‌ర్థికి ఆ పార్టీ అధిష్ఠానం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్ కల్యాణ్... త‌న గెలుపుపై అంత‌గా ధీమాగా క‌నిపించ‌డం లేద‌న్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న సొంత జిల్లాలోని భీమ‌వ‌రం అసెంబ్లీతో పాటుగా విశాఖ జిల్లా గాజువాక నుంచి కూడా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు గాజువాక‌లో నామినేష‌న్ వేయ‌నున్న ప‌వ‌న్‌... ఎల్లుండి భీమ‌వ‌రంలో నామినేష‌న్ వేస్తారు. అయితే ప‌వ‌న్ బ‌రి గురించి ఏమాత్రం ఆలోచించ‌ని వైసీపీ సింగిల్ జాబితాలోనే మొత్తం త‌న అభ్య‌ర్థుల లిస్టును ప్ర‌క‌టించేసింది. ఈ క్ర‌మంలో భీమ‌వ‌రం అభ్య‌ర్థిగా 2014లో బ‌రిలోకి దిగిన గ్రంథి శ్రీ‌నివాస్ కే ఆ పార్టీ భీమ‌వ‌రం టికెట్ క‌న్ ఫార్మ్ చేసింది. అయితే ఇప్పుడు వ‌ప‌న్ అక్క‌డి నుంచి బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌వ‌డంతో గ్రంథి ఒక్క‌సారిగా వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిపోయారు.

అప్ప‌టిదాకా అంద‌రి లాగే గ్రంథి కూడా ఓ సీటు నుంచి వైసీపీ అభ్య‌ర్థి మాత్ర‌మే. అయితే ఇప్పుడు ప‌వ‌న్ ను ఢీకొట్టే అభ్య‌ర్థిగా ఆయ‌న సెంటరాఫ్ అట్రాక్ష‌న్‌గా మారిపోయారు. ఈ క్ర‌మంలో వైసీపీ అధిష్ఠానం గ్రంథికి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కేవ‌లం ప‌వ‌న్‌ ను భీమ‌వ‌రంలో ఓడించి వ‌స్తే చాలు... ఎన్నిక‌ల త‌ర్వాత ఏర్పాట‌య్యే త‌న కేబినెట్ లో గ్రంథికి కీల‌క మంత్రిత్వ శాఖ‌ను ఇస్తాన‌ని పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పార‌ట‌. ఈ మాట విన్నంత‌నే రెట్టింపు ఉత్సాహంతో క‌నిపిస్తున్న గ్రంథి ఇప్ప‌టికే రంగంలోకి దిగిపోయార‌ట‌. మ‌రి ఏ వ్యూహాలు అమ‌లు చేసి ప‌వ‌న్ ను గ్రంథి ఓడిస్తారో తెలియ‌దు గానీ... జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ప‌వ‌న్ ఓడిస్తే మాత్రం గ్రంథికి కీల‌క మంత్రి ప‌ద‌వి మాత్రం ఖాయ‌మే. ఎందుకంటే... ఓ సారి మాటిస్తే త‌ప్ప‌డం జ‌గ‌న్‌కు అల‌వాటు లేదు క‌దా. సో... గ్రంథి ఆల్ ది బెస్ట్‌.