Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ రేసులోకి ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్‌

By:  Tupaki Desk   |   24 May 2015 3:53 PM IST
ఎమ్మెల్సీ రేసులోకి ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్‌
X
సూపర్‌స్టార్‌ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి వచ్చేశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ పార్టీలో పలుపదవుల్ని చేపట్టిన ఆయన.. తాజాగా స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ రేసులోకి వచ్చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న విషయాన్ని విజయవాడలోని ఒక హోటల్‌లో నిర్వహించిన సమరదీక్ష కార్యక్రమంలో ప్రకటించారు.

విజయవాడతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆదిశేషగిరిరావు సొంతూరు బుర్రిపాలెం. అయితే.. విజయవాడలో రాజ్‌.. యువరాజ్‌ థియేటర్లు ఓపెన్‌ చేయటంతో పాటు దాదాపు పదిహేను వాటిని నడిపిన ఆయన.. అదే బెజవాడలో పద్మాలయ ఫిలిమ్స్‌ పేరుతో డిస్ట్రిబ్యూషన్‌ కార్యాలయాన్నికూడా నిర్వహించారు.

పలు సూపర్‌హిట్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన తెలుగులో వంద.. హిందీలో 30.. తమిళంలో పది సినిమాల్ని నిర్మించారు. సూపర్‌కృష్ణ సోదరుడిగా సామాన్య ప్రజానీకానికి సుపరిచితులైన ఆయన మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలోనూ.. ప్రభుత్వ హయాంలోనూ పలు పదవుల్ని చేపట్టిన ఆయన.. అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి నిలవనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆదిశేషగిరిరావు సోదరుడి అల్లుడు.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ మాత్రం ఏపీ అధికారపక్షాన ఉండటం. ఆదిశేషగిరిరావు అభ్యర్థిత్వాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్ఫర్మ్‌ చేయటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.