Begin typing your search above and press return to search.

వైసీపీ మాట‌!..టీడీపీ-బీజేపీలు మ‌ళ్లీ క‌లుస్తాయి!

By:  Tupaki Desk   |   22 March 2018 10:13 AM GMT
వైసీపీ మాట‌!..టీడీపీ-బీజేపీలు మ‌ళ్లీ క‌లుస్తాయి!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా పోరు ఉచ్ఛ స్థాయిలో సాగుతున్న ప్రస్తుత త‌రుణంలో ప్ర‌త్యామ్నాయం లేని కార‌ణంగానే బీజేపీతో టీడీపీ మిత్రుత్వాన్ని వీడింద‌న్న వాద‌న ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. నాలుగేళ్లుగా ఏపీకి ఏమాత్రం న్యాయం చేయలేద‌ని స్వ‌యంగా టీడీపీనే చెబుతున్న నేప‌థ్యంలో... మ‌రి ఆ నాలుగేళ్ల పాటు సైలెంట్‌ గానే ఉన్న టీడీపీ ఇప్పుడు హ‌ఠాత్తుగా ఎందుకు బీజేపీతో మైత్రిని వీడింద‌న్న విష‌యంపై పెద్ద‌గా ఆలోచించాల్సిన ప‌ని లేదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఆది నుంచి పోరాటం సాగించ‌డంతో పాటుగా ఏనాడూ త‌న స్టాండ్ నుంచి అంగుళం కూడా ప‌క్క‌కు జ‌ర‌గ‌ని వైసీపీ... మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ ను చూసి త‌న ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేసింది. ఎంపీల‌తో రాజీనామా చేయించ‌డంతో పాటుగా కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్ర‌వేశ‌పెడ‌తామంటూ ఆ పార్టీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నేప‌థ్యంలో ఒక్క‌సారిగా ఉలికిపాటుకు గురైన టీడీపీ... రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని జ‌నం భావిస్తున్న త‌రుణంలో తాను కూడా పోరాటానికి దిగ‌క‌పోతే చుల‌క‌న కావ‌డ‌మే కాకుండా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌న్న భావ‌న‌కు వ‌చ్చింది. అంతే... అప్ప‌టిదాకా వ‌ద్ద‌న్న ప్ర‌త్యేక హోదానే కావాలంటూ కొత్త రాగం అందుకుంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ మ‌రింత దూకుడు పెంచ‌డంతో కేంద్ర కేబినెట్ లోని త‌న ఇద్ద‌రు ఎంపీల చేత రాజీనామాలు చేయించిన చంద్ర‌బాబు... వైసీపీ బాట‌లోనే న‌డుస్తూ ఎన్డీఏపై అవిశ్వాస తీర్మానానికి త‌లూపారు. ఈ ప‌రిణామాల‌న్నింటినీ చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్న వైసీపీ ఎంపీలు... నేటి ఉద‌యం పార్ల‌మెంటు వేదిక‌గా టీడీపీతో పాటు బీజేపీ వైఖ‌రిపైనా నిప్పులు చెరిగారు. కేవ‌లం ఓటు రాజ‌కీయంతో ముందుకు సాగుతున్న టీడీపీ... భ‌విష్య‌త్తులో బీజేపీతో జ‌ట్టు క‌ట్ట‌డం ఖాయ‌మేన‌ని వైసీపీ ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి - వైవీ సుబ్బారెడ్డి - వైఎస్ అవినాశ్ రెడ్డి - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు తేల్చి పారేశారు. బీజేపీ - టీడీపీలు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయని వారు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. ఇప్పటికీ ఆ రెండు పార్టీలు ఒక అవగాహనతో ఉన్నాయని వారు స్పష్టం చేశారు.

విభజన హామీలు నెరవేర్చాలని తాము పోరాటం చేస్తుంటే... తాము బీజేపీతో కుమ్మక్కయ్యాయంటూ టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు యూటర్న్‌ తీసుకున్నారని, నాలుగేళ్లుగా బీజేపీతో కాపురం చేసి టీడీపీ ఏం సాధించింద‌ని వారు ప్ర‌శ్నించారు. లాలుచీ రాజకీయాలు టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అని. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాకు విలన్‌ చంద్రబాబేన‌ని వారు చెప్పారు. వైసీపీ అవిశ్వాస తీర్మానానికి క్రెడిట్‌ వస్తుందని చంద్రబాబు అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకున్నారని వారు ఆరోపించారు. ఇవ‌న్నీ చూస్తుంటే... భ‌విష్య‌త్తులో టీడీపీ - బీజేపీ మ‌ళ్లీ క‌ల‌వ‌డం ఖాయ‌మేన‌ని వారు తేల్చేశారు.