Begin typing your search above and press return to search.

వానాకాలంలో హోదా మంట‌లు ప‌క్కాన‌ట‌

By:  Tupaki Desk   |   15 July 2017 10:26 AM GMT
వానాకాలంలో హోదా మంట‌లు ప‌క్కాన‌ట‌
X
విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి సంజీవిని లాంటిది ప్ర‌త్యేక హోదా అంశం. అయితే.. ఏపీ పాల‌కుల పుణ్య‌మా అని హోదా అంశం మ‌రుగున ప‌డిపోయింది. ఏపీకి ఎంతో మేలు చేసే హోదా అంశంపై ఆంధ్రోళ్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన మీడియా సైతం అధికార‌ప‌క్షానికి బాస‌ట‌గా నిలిచింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో.. హోదా మీద ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లుమార్లు పోరాటం చేశారు. ఇదే అంశం మీద గ‌ళం విప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఒక ద‌శ వ‌ర‌కూ హ‌డావుడి చేసి.. ఆ త‌ర్వాత కామ్ అయిన సంగ‌తి తెలిసిందే.

హోదా మీద అంత చేస్తా.. ఇంత చేస్తాన‌ని మాట ఇచ్చిన ప‌వ‌న్‌.. ఈ మ‌ధ్య కాలంలో హోదా గురించి మాట్లాడ‌ట‌మే మానేశారు. క‌నీసం ట్వీట్ కూడా లేని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల్ని కాపాడే విష‌యంలో తన‌కున్న క‌మిట్ మెంట్‌ ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ప్ర‌త్యేక హోదాకు సంబంధించిన కీల‌క అంశాల్ని వ‌ర్షాకాల స‌మావేశాల్లో లేవ‌నెత్తాల‌ని.. కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు.

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాల్ని లేవ‌నెత్తాల‌ని ఎంపీల‌కు ఆయ‌న ఉద్భోదించారు. ప్ర‌త్యేక‌హోదాతో పాటు.. రైతు స‌మ‌స్య‌లు.. జీఎస్టీ ఇబ్బందులు.. రైల్వేజోన్‌.. పోల‌వ‌రం ప్రాజెక్టు తో పాటు విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల అమ‌లు అంశాల‌పై ఎంపీలు త‌మ వాణిని వినిపించాల‌న్నారు.

హైద‌రాబాద్ లోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం తాజాగా జ‌రిగింది. పార్టీ ఎంపీలు ప‌లువురు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. హోదా విష‌యంలో ఐదేళ్లు కాదు.. తాము అధికారంలోకి వ‌స్తే ప‌దేళ్లు ఇస్తామ‌ని నాడు బీజేపీ నేత‌లు చెప్పార‌ని.. ఈ నేప‌థ్యంలో హోదా ఐదు కోట్ల ఆంధ్రుల హ‌క్కుగా చెప్పి.. పార్ల‌మెంటులో పోరాడాల‌ని ఎంపీల‌కు జ‌గ‌న్ సూచించిన‌ట్లుగా పార్టీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు.

హోదాపై ప్రైవేటు బిల్లు పెట్టి ఏపీ ప్ర‌జ‌ల వాద‌న‌ను స‌భ‌లో వినిపిస్తామ‌న్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని స‌భ‌లో లేవ‌నెత్తుతామ‌ని.. నీటి పంప‌కాలు.. స్వామినాథ‌న్ క‌మిటీ సిఫార్సుల అంశాన్ని కూడా స‌భ‌లో లేవ‌నెత్త‌నున్న‌ట్లుగా పేర్కొన్నారు. జీఎస్టీ నుంచి చేనేత‌.. టెక్స్ టైల్స్ రంగానికి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన‌ట్లుగా పేర్కొన్నారు. ఇదే అంశాన్ని పార్ల‌మెంటులో కూడా ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లుగా చెప్పారు. ఇదిలా ఉండ‌గా.. పార్టీ పార్ల‌మెంటు స‌భ్యుల స‌మావేశానికి క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక రాక‌పోవ‌టం గురించి చెబుతూ.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నుల బిజీలో రాలేద‌ని చెప్పారు. మంత్రి లోకేశ్‌ను క‌ల‌వ‌టంలో త‌ప్పేమి లేద‌న్న మేక‌పాటి.. తాము కూడా సీఎం చంద్ర‌బాబును క‌లిశామ‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. తాజాగా ముగిసిన స‌మావేశంలో హోదా మీద జ‌గ‌న్ పార్టీ ఫోక‌స్ పెట్టిన తీరు చూస్తే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. హోదాపై మ‌డ‌మ తిప్ప‌కుండా పోరాటం చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇబ్బందేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.