Begin typing your search above and press return to search.

ఢిల్లీ వేదికగా..చంద్రుళ్ల బీపీ పెంచుతున్న వైసీపీ

By:  Tupaki Desk   |   4 Jan 2018 8:11 AM GMT
ఢిల్లీ వేదికగా..చంద్రుళ్ల బీపీ పెంచుతున్న వైసీపీ
X
తెలుగురాష్ర్టాల ముఖ్యమంత్రులుగా వేర్వేరు అజెండాలతో ముందుకువెళుతున్నప్పటికీ... రాజకీయం నెరపడంలో ఒకే అజెండాతో ముందుకు సాగుతున్న ఏపీ - తెలంగాణ ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు బీపీ పెంచే దిశ‌గా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు. ఇందుకు ఢిల్లీ వేదిక‌గా పార్ల‌మెంటు స‌మావేశాల రూపంలో వైసీపీ ముందుకు సాగుతోంద‌ని తాజా ప‌రిణామం సాక్షంగా ఉంద‌ని చెప్తున్నారు. వైకాపా గుర్తుపై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీ వై.వి సుబ్బారెడ్డి స్పీకర్ సుమిత్రా మహాజన్‌ కు బుధవారం ఫిర్యాదు చేయ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైఎస్ జ‌గ‌న్‌ పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా స‌మావేశాలకు ముందే...పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఏ విధ‌మైన వ్యూహం అనుస‌రించాల‌నే అంశాన్ని చ‌ర్చించేందుకు వైసీపీ ఎంపీలు వైఎస్ జ‌గ‌న్‌తో స‌మావేశ‌మ‌య్యారు. పార్టీ నేత‌ల వ‌ద్ద జ‌రిగిన చ‌ర్చ ప్ర‌కారం విభజన చట్టంలోని అన్ని అంశాలను పూర్తిచేసేందుకు పార్టీ నేత‌లు కృషి చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు. ఇందుకోసం పార్ల‌మెంటు వేదిక‌గా పోరాటం చేయాలన్నారు. ఈ సంద‌ర్భంగా జంపింగ్ ఎంపీల అన‌ర్హ‌త వేటు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఇటీవ‌ల ఉప‌రాష్ట్రప‌తి - రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు ఇద్ద‌రు ఎంపీల‌పై వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. సంబంధిత పార్టీల ఫిర్యాదు మేర‌కు ఉప‌రాష్ట్రప‌తి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో పాటుగా ఏ స‌భ అయినా అనర్హ‌త ఫిర్యాదు అందిన వారిపై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. వైఎస్ జ‌గ‌న్‌, ఆ పార్టీ ఎంపీల స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఎంపీలు ఎస్పీవై రెడ్డి - కొత్తపల్లి గీత - బుట్టా రేణుక టీడీపీలోకి - పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్‌ ఎస్‌ లోకి వెళ్లిపోయారు. ఈ ఫిరాయింపులను సాక్షాత్తు ఇరు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులే ప్రోత్స‌హించారు. ఈ నేప‌థ్యంలో రాబోయే స‌మావేశాల్లో ఈ జంపింగ్ ఎంపీల‌పై ఫిర్యాదు చేయాల‌ని వైసీపీ నేత‌లు జ‌గ‌న్‌ తో జ‌రిగిన భేటీలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎంపీల్లో ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఒకరు పార్టీ ఫిరాయించారని.. ఆ ఎంపీల‌పై చ‌ర్య‌లు కోరుతూ ఈ మేరకు స్పీకర్‌కు సుబ్బారెడ్డి లేఖ రాశారు. రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన ఎంపీలపై చైర్మన్ వెంకయ్య నాయుడు చర్యలు తీసుకున్న విధంగానే లోక్‌సభలో కూడ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ అయిన రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు పాటించిన విధాన‌మే స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ కూడా అనుస‌రిస్తే...ఈ న‌లుగురు ఎంపీల‌పై వేటు ఖాయ‌మ‌ని అంటున్నారు. అదే జ‌రిగితే ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు ఇర‌కాట‌మైన ప‌రిస్థితే ఎదుర‌వుతుంద‌ని చెప్తున్నారు. స్థూలంగా ఢిల్లీ వేదిక‌గా తెలుగు రాష్ర్టాల సీఎంల తీరును వైసీపీ ఎండ‌గ‌ట్టింద‌ని అంటున్నారు.