Begin typing your search above and press return to search.

జగన్ పై మోదీకి రఘురామ సంచలన లేఖ

By:  Tupaki Desk   |   7 July 2022 11:49 PM IST
జగన్ పై మోదీకి రఘురామ సంచలన లేఖ
X
సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నుంచి త‌న‌కు ప్రాణహాని ఉంద‌ని రఘురామ ఆరోపించారు. అంతేకాదు, త‌న‌కు జగన్ నుంచి ముప్పు పొంచి ఉందంటూ తోటి ఎంపీలందరికీ రఘురామ లేఖ రాయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. రఘురామ రాసిన 4 పేజీల‌ లేఖ‌లో జ‌గ‌న్‌ తో పాటు వైసీపీ నేతలపై కూడా షాకింగ్ ఆరోపణలు చేశారు.

జగన్ పాలనను, వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి విమర్శించినందుకు తనపై కక్ష సాధిస్తున్నారని, ఓ ద‌ఫా ఏపీ సీఐడీ అధికారులు త‌న‌ను అరెస్ట్ చేశారని తోటి ఎంపీలకు రఘురామ లేఖ రాశారు. అంతేకాదు, క‌స్ట‌డీలో ఉన్నప్పుడే తనపై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని, దెబ్బలు కనిపించకుండా అరికాళ్లపై తీవ్రంగా కొట్టారని ర‌ఘురామ లేఖలో ఆరోపించారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తనపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని లేఖలో తెలిపారు.

ఏపీ ప్రభుత్వం గతంలో తనపై దేశద్రోహం కేసు నమోదు చేసిందని, తాజాగా మరోసారి తన నివాసం వద్ద పోలీసులు రెక్కీ నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించి ఎత్తుకెళ్లి చంపడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. రెక్కీ నిర్వహించిన వారు దొంగ పోలీసులని, దొరికితే పోలీసులమని చెప్పి బుకాయించారని అన్నారు. హైదరాబాద్‌లో ఓ పోలీస్ అధికారి సహకారంతో తనపై రివర్స్ కేసులు పెడుతున్నారని అన్నారు.

అయితే, ఇటీవల నరసాపురం పర్యటనకు బయలుదేరిన రఘురామ అర్ధాంతరంగా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తన అనుచరులను ఏఫీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెనుదిరిగి వెళుతున్నానని రఘురామ ఆరోపించారు. నరసాపురంలో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమానికి ఆహ్వానితుల జాబితాలో స్థానిక ఎంపీగా ప్రొటోకాల్ ప్రకారం తన పేరుండాలని, కానీ, తన పేరు లేకుండా ఏపీ ప్రభుత్వం కక్ష సాధించిందని ఆయన కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా జ‌గ‌న్ నుంచి త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందని మ‌రోసారి ర‌ఘురామ‌ లేఖ రాయ‌డం ప్రాధాన్యతను సంత‌రించుకుంది.