Begin typing your search above and press return to search.

అప్పుడు కొట్టిన కేసులో జగన్ పార్టీ ఎంపీ అరెస్ట్

By:  Tupaki Desk   |   17 Jan 2016 4:45 PM IST
అప్పుడు కొట్టిన కేసులో జగన్ పార్టీ ఎంపీ అరెస్ట్
X
ఆ మధ్యన రేణిగుంట విమానాశ్రయంలో ఒక అధికారిపై చేయి చేసుకున్న ఘటనకు సంబంధించి జగన్ పార్టీకి చెందిన కడప జిల్లా రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ మధ్యన రేణిగుంట విమానాశ్రయ మేనేజర్ రాజశేఖర్ పై ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు దాడి చేయటం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన పలువురు ఉన్నారన్న ఆరోపణ ఉంది.

ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు రావటంతో మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు. ఆ మధ్యన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ ఎయిర్ పోర్ట్ లో అధికారిపై దాడి చేస్తే.. దానికి చెందిన వీడియో ఫుటేజ్ కూడా సంపాదించలేకపోయారంటూ తన సహచరులపై నిప్పులు చెరగటం తెలిసిందే.

ఎయిర్ పోర్ట్ మేనేజర్ పై భౌతిక దాడికి పాల్పడిన ఘటనపై ఏపీ సర్కారు చాలా సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టొద్దని గట్టిగా చెప్పటం..ఎంపీ అరెస్ట్ కు అవసరమైన ఆధారాల్ని సేకరించిన అధికారులు.. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు.. ఆయన అనుచరులు పలువురిని అరెస్ట్ చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రేణిగుంట విమానాశ్రయంలో.. ఎయిర్ పోర్ట్ మేనేజర్ పై మిథున్ రెడ్డి దాడి చేస్తే.. శనివారం అర్థరాత్రి ఆయన్ను చెన్నై ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేశారు. మరోవైపు.. మిథున్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ఏపీ సర్కారు మోసపూరితంగా వ్యవహరించిందని ఆయన తండ్రి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించటం గమనార్హం.