Begin typing your search above and press return to search.

బీజేపీకి మ‌ద్దతుపై వైఎస్సార్సీపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   5 July 2022 9:54 AM GMT
బీజేపీకి మ‌ద్దతుపై వైఎస్సార్సీపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
వైఎస్సార్సీపీ ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త మూడేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి వైఎస్సార్సీపీ మ‌ద్దతు ఇస్తూనే ఉంద‌ని ఆయ‌న హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్య‌లిప్పుడు వైర‌ల్ గా మారాయి. బీజేపీకి వైఎస్సార్సీపీ మ‌ద్ద‌తు ఇస్తుండ‌టంలో ఎలాంటి దాప‌రికం కూడా లేద‌ని శ్రీధ‌ర్ చెబుతున్నారు.

గత మూడేళ్లుగా కేంద్రంలో బీజేపీకి వివిధ అంశాల్లో మద్దతు ఇస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకీ ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించామని అన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తుండడం వల్లే రాష్ట్రానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. కోట‌గిరి శ్రీధ‌ర్ వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రాలుగా మారాయి.

వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వంతో అంట‌కాగుతోంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టికే తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సీఎం వైఎస్ జ‌గ‌న్ త‌న‌పై అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ నుంచి త‌ప్పించుకోవ‌డానికి బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్ వ్యాఖ్య‌లు కూడా ఇదే కోవ‌లో ఉండ‌టం వారికి అస్త్రంగా మారింది.

తాజాగా తిరుమ‌ల వ‌చ్చిన కోట‌గిరి శ్రీధ‌ర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 2024లో వైఎస్ఆర్సీపీ గెలిస్తే.. కేంద్రంలో ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు కూడా ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

అలాగే కేంద్ర ప్ర‌భుత్వంలో వైఎస్సార్సీపీ కూడా చేరుతుంద‌న్నారు. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తేనే అనే ష‌ర‌తు పెడ‌తామ‌ని శ్రీధ‌ర్ తెలిపారు. ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వానికి వైఎస్సార్సీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలో దాప‌రికం ఏమీ లేద‌న్నారు. కేంద్రానికి అలా మ‌ద్ద‌తు ఇస్తున్నందుకే ఏపీకి నిధులు వ‌స్తున్నాయ‌ని వివ‌రించారు.

ప్రస్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవ‌న్నీ తెస్తున్నామని, ప్రత్యేక హోదా ఒక్కటే రావాల్సి ఉందని కోటగిరి శ్రీధర్ చెబుతున్నారు. అలాగే తమకు ప్రత్యేక రహోదా సాధిస్తామనే నమ్మకం కూడా ఉందన్నారు.