Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ అనంత‌బాబుది క‌ట్టుక‌థే.. వాచ్‌మెన్ సాక్ష్యం ఇదే!

By:  Tupaki Desk   |   24 May 2022 3:02 PM GMT
ఎమ్మెల్సీ అనంత‌బాబుది క‌ట్టుక‌థే.. వాచ్‌మెన్ సాక్ష్యం ఇదే!
X
ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. హత్య జరిగిన అపార్ట్మెంట్ వద్ద సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో అక్కడ గొడవ జరిగినట్లు ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదు. మరోవైపు అక్కడ పని చేస్తున్న వాచ్మెన్ సైతం అపార్ట్మెంట్ వద్ద ఎలాంటి గొడవ జరగలేదని చెబుతున్నారు. ఈ పరిణామాలతో డ్రైవర్ హత్య కేసు మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది.

ఈ నెల 19న రాత్రి 10.30 సమయంలో అపార్ట్మెంట్ వద్ద ఎలాంటి గొడవ జరగలేదని సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు మాత్రం.. గొడవలో సుబ్రహ్మణ్యం కింద పడిపోవడం వల్లే చనిపోయాడని చెబుతున్నారు. రాత్రి 12 గంటలకు అనంతబాబు హడావుడిగా భార్యతో తిరిగి వచ్చినట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. మళ్లీ ఒంటిగంటకు తిరిగి వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీల్లో ఉంది.

మరోవైపు సుబ్రహ్మణ్యం మృతి చెందాడని చెబుతున్న అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్గా పని చేస్తున్న శ్రీను.. అసలు గొడవే జరగలేదని చెప్పేశారు. అనంతబాబు మూడో అంతస్తులో ఉండేవారని అపార్ట్మెంట్‌ వాచ్‌మెన్‌ శ్రీను తెలిపారు. చనిపోయిన సుబ్రహ్మణ్యానికి తాను బాబాయి అవుతానని చెప్పారు. పుట్టినరోజు వేడుకలు అపార్ట్మెంట్ వద్ద జరగలేదని స్పష్టం చేశారు. ఎస్పీ చెప్పినట్టు ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదన్నారు..

ప్రమాదంలో చనిపోయాడని సుబ్రహ్మణ్యం తండ్రి నాకు ఫోన్ చేసి చెప్పారని వివరించారు. అదే సమయంలో అనంతబాబు కంగారుగా వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. అనంతబాబుతో ఆయన భార్య కూడా ఉన్నారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు భార్యతో వెళ్లి అర్ధరాత్రి వచ్చారని చెప్పారు. పోలీసులు ఎవరూ మా దగ్గరకు రాలేదని అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ శ్రీను స్పష్టం చేశారు. దీంతో అనంత‌బాబు చెప్పిన‌ట్టు అపార్టుమెంటు ద‌గ్గ‌రే కేవలం 20 వేల కోసం గొడ‌వ జ‌రిగింద‌న్న వాద‌న‌లో ప‌స‌లేద‌ని అర్ధ‌మ‌వుతోంది.

సీబీఐకి అప్ప‌గించాలి:  విప‌క్షాలు

మ‌రోవైపు. కేసులో ఏడుగురు నుంచి ఎనిమిది మంది వ‌ర‌కు హ‌స్తం ఉండి ఉంటుంద‌ని.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు.. కోట్ల‌కు ప‌గ‌డ‌లెత్తిన ఎమ్మెల్సీ.. కేవ‌లం 20 వేల కోసం.. ఇలా చేస్తాడంటే న‌మ్మ‌లేమ‌ని.. పోలీసులు కాక‌మ్మ క‌థ‌లు చెబుతున్నారని..దీనివెనుక చాలా పెద్ద ఎత్తున కుట్ర ఉండి ఉంటుంద‌ని అంటున్నారు. ఈ కేసును సీబీఐకి అప్ప‌గిస్తే.. త‌ప్ప వాస్త‌వాలు వెలుగు చూసే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఎమ్మెల్సీ హ‌త్య చేశాడ‌ని.. పోలీసులు కూడా చెప్పిన త‌ర్వాత‌.. ఆయ‌నను ఇంకా ఆ ప‌ద‌విలోనే కొన‌సాగించ‌డం.. పైనా.. విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. దీనిపై తాము కోర్టుకు వెళ్తామ‌ని చెబుతున్నాయి. దీంతో ఈ కేసు మ‌రిన్ని మ‌లుపులు తిర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.