Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్సీ మాజీ కారు డ్రైవ‌ర్‌ది హ‌త్యే: పోస్ట్‌మార్టం రిపోర్ట్‌

By:  Tupaki Desk   |   22 May 2022 9:06 AM GMT
వైసీపీ ఎమ్మెల్సీ మాజీ కారు డ్రైవ‌ర్‌ది హ‌త్యే:  పోస్ట్‌మార్టం రిపోర్ట్‌
X
రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన.. గ‌త నాలుగు రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉద‌య్ భాస్క‌ర్ మాజీ డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి ఘ‌ట‌న కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా వ‌చ్చిన పోస్ట్ మార్టం నివేదిక‌లో సుబ్ర‌హ్మ‌ణ్యం .. హ‌త్య‌కు గుర‌య్యాడ‌ని స్ప‌ష్ట‌మైంది. త‌ల‌మీద ఎడ‌మ వైపు.. ఎడ‌మ కాలు బొట‌న వేలు పైన‌, కుడికాలు మ‌డ‌మ ద‌గ్గ‌ర గాయాలు అయిన‌ట్టు.. వైద్యులు త‌మ నివేదిక‌లో పేర్కొన్నారు. దీనిని బ‌ట్టి.. సుబ్ర‌హ్మ‌ణ్యం ప్ర‌మాద ఘ‌ట‌న‌లో చ‌నిపోలేద‌ని.. అత‌ను హ‌త్య‌కు గుర‌య్యాడ‌ని తేల్చారు. సుబ్రమణ్యం శరీరంలో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.

హ‌త్య కేసుగా న‌మోదు!

ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఆయనను పోలీసులు ఎ-1 నిందితుడిగా ప్రకటించారు. అనుమానస్పద మృతి కేసును కాస్తా.. హత్యకేసుగా మార్చారు. దీంతో ఏ క్షణమైనా ఎమ్మెల్సీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. వాస్త‌వానికి ఈ కేసులో ఆది నుంచి అనేక ట్విస్టులు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఈ నెల 19న వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదానికి, అధికార పార్టీ నేత‌ల అరాకానికి నిలువుట‌ద్దంగా ప‌రిణ‌మించిం ద‌ని.. ప్రతిప‌క్ష నాయ‌కులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అస‌లు ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింది.. ఏ రోజు అప్డేట్ ఏంటనేది చూస్తే..

మే 19: ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ మే 19న‌ ఉదయం.. కారులో తనతోపాటు మాజీ డ్రైవర్ సుబ్ర హ్మణ్యాన్ని తీసుకెళ్లారు. త‌న‌తో ప‌ని ఉందంటూ.. ఇంటికి వ‌చ్చి మ‌రీ తీసుకువెళ్లారు. అదే రోజు రాత్రి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ప్రమాదం జరిగిందంటూ డ్రైవర్‌ తమ్ముడికి.. సమాచారం ఇచ్చారు ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్‌. ఆ తర్వాత తన కారులోనే డ్రైవర్ మృతదేహాన్ని తీసుకొచ్చిన ఎమ్మెల్సీ.. మే 20వ తేదీ తెల్లవారు జామున 2 గంటలకు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కుటుంబ స‌భ్యుల నిల‌దీత‌: ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడగ్గా.. ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పారని, సరైన సమాధానం చెప్పాలని అడగ్గా.. మృతదేహాన్ని కారులోనే వదిలేసి, వేరే కారులో వెళ్లిపోయారని మృతుని బంధువులు తెలిపారు. దీంతో.. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతుడు సుబ్రహ్మణ్యం.. ఎమ్మెల్సీ వద్ద ఐదేళ్లపాటు డ్రైవర్‌గా పని చేశాడు.

మే 20: రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష‌యం సంచ‌ల‌నంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పాద మృతిగా తొలుత కేసు న‌మోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టు మార్టంకు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. స‌బ్ర‌హ్మ‌ణ్యం భార్య , ఆయ‌న కుటుంబం అడ్డుప‌డ్డారు.

'నా భర్త మృతిదేహం కుళ్లిపోయినా ఫరవాలేదు.. కానీ, పోస్టుమార్టానికి అంగీకరించేది లేదు' అని తేల్చిచెప్పారు. మార్చురీ వద్దకు బలవంతంగా తీసుకెళ్లినా శవ పంచనామాకు అంగీకరించలేదు. ఈ దశలో 'పోలీసులు నన్ను కొట్టారు' అని ఆమె చేసిన విడుదల చేసిన ఆడియో సందేశం తీవ్ర కలకలం రేపింది.

బంధువులు, దళిత సంఘాలు రోడ్డెక్కాయి. ఉద్రిక్తతలు పెరగడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద నలుగురు డీఎస్పీలు, 30మంది ఎస్‌ఐలు, 70మంది కానిస్టేబుళ్లు మోహరించారు. ఇంటివద్ద సరైన భద్రత లేకపోవడం, ఉదయభాస్కర్‌ అనుచరుల అనుమానిత కదలికలతో భయభ్రాంతులకు గురై ఇంటికి తాళం వేసి బాధితులు సామర్లకోటలో తలదాచుకున్నారు. పోలీసులు జాడ పసిగట్టి అక్కడకు వెళ్లి వారితో బేరాలాడారు. శవ పంచనామాకు సహకరిస్తే రూ.40లక్షలు, వైసీపీలో పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. అందుకు వాళ్లు అంగీకరించకపోవడంతో పోలీసులు వెనక్కి వచ్చారు.

మే 22...

బాధితురాలి డిమాండ్‌పై అర్ధరాత్రి దాటాక రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చేవరకు వారు అక్కడే బైఠాయించా రు. మృతుని భార్య, కుటుంబంతో ప్రభుత్వం తరఫున కాకినాడ ఆర్డీవో బీవీ రమణ చర్చలు జరిపారు. పోస్టుమార్టానికి సహకరించాలని కోరారు. అలాచేస్తే.. మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, మృతుని సోదరుడికి అవుట్‌సోర్సింగ్‌ కొలువు, కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, 8.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే ఎమ్మెల్సీ అరెస్టు దిశగా పోలీసులు రంగంలోకి దిగడంతో బాధిత కుటుంబం... ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించింది. దీంతో పోస్టు మార్టం చేసి.. నివేదిక ఇచ్చారు.

కార‌ణం ఇదేనా!

సుబ్రహ్మణ్యం తనకు రూ.20వేల బాకీ ఉన్నాడని, ఇవ్వకపోతే కాళ్లు, చేతులు విరిచేస్తానని పలుసార్లు ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ మృతుడి కుటుంబీకులను ఫోన్‌లో హెచ్చరించిన‌ట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సజీవంగా తీసుకువెళ్లి 12.30 సమయంలో మృతదేహంగా తీసుకువచ్చారు. అయితే.. కాకినాడకు చెందిన ఓ వ్యాపారి కూతురితో ఉదయభాస్కర్‌కు ఉన్న బంధమే డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకు దారితీసిందనే కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పలుసార్లు ఆ యువతిని ఆమె ఇంటివద్ద స్వయంగా సుబ్రహ్మణ్యం దించాడు. ఓసారి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె.. సుబ్రహ్మణ్యంపై ఉదయభాస్కర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో డ్రైవర్‌ ఉద్యోగంలోంచి తీసేశారని, ప్రస్తుతం ఉదయభాస్కర్‌ వద్ద పనిచేస్తున్న ఓ డ్రైవర్‌ వివరించాడు.

ఆ తర్వాత కూడా అతనిపై ఆమె ఫిర్యాదులు చేస్తుండటంతో కక్ష పెంచుకున్నారని, పథకం ప్రకారమే హత్య చేయించారని చెబుతున్నారు. కాగా, సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని, దానిని ఉంచిన కారును అత‌ని ఇంటి వద్ద వదిలి పరారైన ఎమ్మెల్సీ.. శనివారమంతా వివాహ వేడుకలతో బిజీ అయ్యారు. రంపచోడవరం, తునిలో జరిగిన పెళ్లిళ్లకు హాజరయ్యారు.