Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే ప‌ద‌వికి గుడ్‌ బై చెప్పేశారు

By:  Tupaki Desk   |   2 July 2016 2:29 PM GMT
వైసీపీ ఎమ్మెల్యే ప‌ద‌వికి గుడ్‌ బై చెప్పేశారు
X

క‌డ‌ప జిల్లా మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అధికారులు పదే పదే ప్రొటోకాల్‌ ను ఉల్లంఘించి అవమానిస్తున్నారని. ఈ విషయమై అసెంబ్లీ స్పీకర్‌ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది తన పదవికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరుతూ లేఖను స్పీకర్‌ కు ఫ్యాక్స్ చేయ‌డ‌మే కాకుండా కొరియర్ ద్వారా కూడా పంపారు.

సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన మైదుకూరులో చోటుచేసుకున్న ప్రొటోకాల్ ఉల్లంఘనతోపాటు గతంలో జరిగిన సంఘటనలను ఆయన తన రాజీనామా లేఖలో వివరించారు. రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డిని జమ్మలమడుగు ఆర్డీఓ ఆహ్వానించారు. మైదుకూరు హైస్కూల్‌ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను తొలుత వేదికపైకి పిలవాల్సింది పోయి ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌ ను ఆహ్వానించారు. ఇలా ఆహ్వానించడం ప్రొటోకాల్ నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ అధికారులు పట్టించుకోలేద‌ని దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారని ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు. ఈ క్ర‌మంలో క‌ల‌త చెంది ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని పేర్కొంటున్నారు.

జిల్లాలో అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం ఇది తొలిసారి కాదని వైసీపీ వ‌ర్గాలు అంటున్నారు. ఇలా అవ‌మానించ‌డాన్ని స్పీకర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని రఘురామిరెడ్డి వ‌ర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా మనస్తాపం చెందిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.