Begin typing your search above and press return to search.

ఈ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప‌నేదో బాగుందిగా!

By:  Tupaki Desk   |   18 Aug 2022 9:30 AM GMT
ఈ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప‌నేదో బాగుందిగా!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌య‌ఢంకా మోగించ‌డ‌మే ల‌క్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు ప్ర‌తి ఇంటికీ వెళ్తున్నారు. ఈ మూడేళ్ల‌లో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం చేసిన ల‌బ్ధి గురించి ప్ర‌తి కుటుంబానికి వివ‌రిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయా కుటుంబాల‌కు వివిధ సంక్షేమ ప‌థ‌కాల కింద ఎంత ల‌బ్ధి చేకూరింద‌నే విష‌యాన్ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌నే గెలిపించాల‌ని కోరుతున్నారు.

మ‌రోవైపు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌లు చుక్క‌లు చూపిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల్లో గెలిచిన మూడేళ్ల త‌ర్వాత తాము గుర్తు వ‌స్తున్నామా అని నిల‌దీస్తున్నారు. వివిధ ప‌థ‌కాలు త‌మ‌కు అంద‌లేద‌ని, తాగునీటి స‌మస్య‌, డ్రైనేజ్ స‌మ‌స్య‌, రోడ్లు బాలేద‌ని ఇలా అనేక స‌మ‌స్య‌ల‌ను ఏక‌ర‌వు పెడుతున్నారు.

త‌మ‌కు వ‌చ్చే పెన్ష‌న్‌ను తొల‌గించార‌ని.. ఇలా అనేక స‌మ‌స్య‌ల‌పై ఎమ్మెల్యేల‌ను గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నేత‌లు చేసేదేమీ లేక ఏదో ఒక‌టి చెప్పి బ‌య‌ట‌ప‌డుతున్నారు. మ‌రికొంత‌మంది పోలీసుల‌కు ఆదేశాలు ఇచ్చి త‌మ‌ను ప్ర‌శ్నించిన‌వారిని అరెస్టు చేయిస్తున్నార‌నే విమ‌ర్శ‌లూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా అనంత‌పురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో త‌నను ప్ర‌జ‌లు నిల‌దీయ‌కుండా ఒక వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ప‌ర్య‌ట‌న‌కు ముందే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న అనుచ‌రుడిగా కీల‌క నాయ‌కుడిని తాను వెళ్లాల‌నుకున్న గ్రామానికి ఒక రోజు ముందుగానే పంపిస్తున్నార‌ని టాక్. ఎమ్మెల్యే పంపిన నాయ‌కుడు ప్ర‌జ‌ల‌తో మాట్లాడి.. స‌మ‌స్య‌లు ఏమైనా ఉన్నాయోమోన‌ని తెలుసుకుంటున్నార‌ట‌.

రేపు మీ ఊరికి ఎమ్మెల్యే రానున్నార‌ని.. ఆయ‌న‌ను స‌మ‌స్య‌ల‌పై నిల‌దీయడం, ప్ర‌శ్నించ‌డం చేయొద్ద‌ని.. ఏమైనా ఉంటే ఇప్పుడే త‌న‌కు చెప్పండ‌ని ప్ర‌జ‌ల‌ను వేడుకుంటున్నార‌ట‌. స‌మ‌స్య‌ల గురించి త‌న‌కు చెబితే తాను ఎమ్మెల్యేకు నివేదిస్తాన‌ని ఆ నాయ‌కుడు చెబుతున్నాడ‌ట‌. ఎమ్మెల్యే వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఆయ‌న‌ను నిల‌దీయ‌డం, ప్ర‌శ్నించ‌డం వాటిని మ‌ళ్లీ వీడియోలు తీసి సామాజిక మాధ్య‌మాల్లో పెట్ట‌డం వంటి ప‌నులు చేయొద్ద‌ని కోరుతున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేల తీరు వివాదాస్ప‌దం కావ‌డం, ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అనంత‌పురం జిల్లా ఎమ్మెల్యే ఇలాంటి వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాడ‌ని చెవులు కొరుక్కుంటున్నారు. ప్ర‌జ‌లు మాత్రం ఇదెక్క‌డి చోద్యం అని బుగ్గ‌లు నొక్కుకుంటున్నార‌ట‌.