Begin typing your search above and press return to search.

రైతులు కడుపుమండి రోడ్డెక్కితే కేసులు పెడతారా .. పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం !

By:  Tupaki Desk   |   21 Sept 2020 3:00 PM IST
రైతులు కడుపుమండి రోడ్డెక్కితే కేసులు పెడతారా .. పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం !
X
ఈ సమాజంలో నిరసన తెలపడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఏ విషయం పైనైనా , నిరసన తెలుపవచ్చు. అలా తాము పండించే పంటలకు గిట్టుబాటు ధర లేదని , రోడ్డెక్కి నిరసర తెలుపుతున్న రైతులపై కేసులు పెట్టిన పోలీసుల పై , ప్రభుత్వ అధికారుల తీరు పై వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ప మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో రైతుల విషయంలో అధికారుల సమన్వయ లోపంతో సమస్యలు వస్తున్నాయన్నానారు. ప్రతి రైతు పండించే పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని సీఎం జగన్ చెప్పారని, ఎన్ని కష్టాలొచ్చినా రైతులు నష్టపోకుండా చూడాలని చెప్పినప్పటికీ కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో సమన్వయం లోపం కనిపించింది అని, అందుకే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

ఈ సమయంలో తమకు అన్యాయం జరిగిందని, రైతులు రోడ్డెక్కి నిరసన చేశారని, కానీ వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు కాకాణి. జిల్లా ఎస్పీ కేసుల పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎస్పీ తెలిసి చేశారో.. తెలియక చేశారో తెలియదు.. వెంటనే రైతులపై పెట్టిన కేసుల్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఈ తరహా నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, నిరసన తెలపడం శాంతిభద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. రైతుల్ని భయపెట్టాలని చూడొద్దన్నారు. రైతులపై కేసులు ఉపసంహరించుకోకపోతే ప్రత్యక్ష చర్యకు దిగుతానని హెచ్చరికలు జారీచేశారు. దమ్ముంటే మిల్లర్లు, దళారులపై కేసులు పెట్టలన్నారు గోవర్థన్ రెడ్డి. రైతులు కడుపుమండి గిట్టబాటు ధరకోసం రోడ్డుపైకి వస్తే కేసులు పెడతారా, రైతు సమస్యలు తెలుసా, ప్రభుత్వ ఆదేశాలను సక్రమంగా పాటించలేని అధికార యంత్రాంగం తమ అసమర్థతతో రైతులపై కేసులు పెట్టి సమస్యను పక్కదోవ పట్టించడం మంచిది కాదన్నారు. సమస్యల్ని పరిష్కరించాలి కానీ కేసులు పెట్టడం పరిష్కారం కాదని, రైతుల్ని రాజకీయ దృష్టితో చూస్తే తాను చూస్తూ ఉండనని అన్నారు.