Begin typing your search above and press return to search.

భీమవరం ఎమ్మెల్యే ఇంటి ముందు స్వాముల భజన నిరసన.. అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   6 Nov 2022 8:30 AM GMT
భీమవరం ఎమ్మెల్యే ఇంటి ముందు స్వాముల భజన నిరసన.. అసలేం జరిగింది?
X
ఏపీలో రాజకీయం అంతకంతకూ మారిపోతోంది. అక్కడి రాజకీయం ఇప్పటికే వ్యక్తిగత వైరం వరకు వచ్చేస్తే.. రోజులు గడుస్తున్న కొద్దీ ముదిరిపాకాన పడుతున్నట్లుగా కనిపిస్తోంది. భీమవరంలో చోటుచేసుకున్న వైనం గురించి తెలిస్తే కాసింత ఆశ్చర్యపోవాల్సిందే. ఇలాంటి ఇష్యూస్ లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు తల దూరుస్తున్నారన్న ప్రశ్న తలెత్తక మానదు. రాజకీయంగా ఉండే వైరం ఎటూ ఉంటుంది. దాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లటం ద్వారా నష్టం జరిగేది వైసీపీ ఎమ్మెల్యేకే అన్న విషయాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నారన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.

వైరం ఉండటం తప్పేం కాదు. కానీ.. దాన్ని తీసుకునేదానికి ఒక లెక్కంటూ ఉండాలి కదా? అదేమీ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు రానున్న రోజుల్లో మరిన్ని ఇష్యూస్ కు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రనివాస్ తీరు ఇప్పుడు ఇలానే ఉందంటున్నారు. శనివారం రాత్రి ఆయన ఇంటి ముందు అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు పెద్ద ఎత్తున చేరి.. రోడ్డు మీద కూర్చొని అయ్యప్ప నామాల్ని కీర్తిస్తూ తమ నిరసనను వ్యక్తం చేయటం సంచలనంగా మారింది.

చిన్న విషయాలకు అనవసర జోక్యం చేసుకోవటం ద్వారా కొత్త వివాదాలకు తెర తీసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తున్న వేళ.. అందుకు తగ్గట్లే తాజా పరిణామం ఉండటం గమనార్హం. భీమవరంలోని సింహాద్రి అప్పన్న దేవాలయం వద్ద గడిచిన 28 ఏళ్లుగా పడిపూజ చేసుకుంటారు. సంప్రదాయంగా వస్తున్న ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరు. తాజాగా అయ్యప్ప మాల వేసుకున్న జనసేన మద్దతుదారు పడిపూజను నిర్వహిస్తున్నారు. దీంతో.. ఈ పడిపూజను అడ్డుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారుల్ని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.

దీంతో అప్పటికే షామియానా వేసి.. టిఫిన్లుతయారు చేస్తూ.. పూజా కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న వేళ.. వాటిని అధికారులు అడ్డుకోవటంతో తీవ్ర వేదనకు గురయ్యారు స్వాములు. అయ్యప్ప మాటలో ఉన్న వారు భక్తిభావంతో చేసే కార్యక్రమాన్ని రాజకీయంగా ఎలా చూస్తారన్నప్రశ్న వచ్చింది. అయినప్పటికీ పడిపూజ నిర్వహణకు నిరాకరించటంపై అయ్యప్పలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

''అసలేం చేస్తున్నారో అర్థమవుతుందా? ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుస్తుందా? ఇదెక్కడి అహంకారం? ఇది మీ పతనానికి నాంది'' అంటూ పలువురు అయ్యప్పలు ఆవేదనతో చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయ్యప్ప మాలలో ఉండి.. నిష్టగా.. భక్తి శ్రద్దలతో పూడి పూజ చేస్తుంటే.. అధికారులు వచ్చి అనుమతి లేదన్న కారణాన్ని చూపించి.. పూజా కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పటంతో వారంతా భీమవరం ఎమ్మెల్యే ఇంటి ముందుకు వెళ్లారు. అక్కడే పెద్ద ఎత్తున అయ్యప్ప నామాలు జపిస్తూ నిరసన చేపట్టారు. అయ్యప్ప శరణాలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించటమే కాదు.. ఇదంతా ఎమ్మెల్యేకు అవసరమా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇప్పటివరకు గాంధీ గిరి మాత్రమే తెలుసని.. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే పుణ్యమా అని.. అయ్యప్ప గిరి బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు.