Begin typing your search above and press return to search.

ఈ బిడ్డ‌ల‌ను ఆదుకోండి సీఎం స‌ర్..

By:  Tupaki Desk   |   19 Jun 2022 12:00 PM IST
ఈ బిడ్డ‌ల‌ను ఆదుకోండి సీఎం స‌ర్..
X
అమ్మ లేదు స‌ర్.. అమ్మ ఒడి రావ‌డం లేదు. ఈ రెండు మాట‌లు చ‌దివి చూడండి.. మీరు కూడా క‌న్నీటి ప‌ర్యంతం అవుతారు. అ ర్హ‌త ఉన్నా ప‌థ‌కాలు రాని, వర్తింపు కానీ ఆ చిన్నారుల ద‌య‌నీయ‌త మ‌రోసారి అక్క‌డి వారిని క‌దిలింపజేసింది.వినూత్న రీతిలో ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం అని చెప్పే పాల‌కుల‌కు ఇలాంటివి చిన్న విష‌యాలు కావు. కాకూడ‌ద‌దు కూడా అని అభిప్రాయ‌ప‌డుతున్నారు సామాజిక కార్య‌క‌ర్త‌లు. ఒక విక‌లాంగుడికి, ఒక వృద్ధుడికి, ఇంకా ఒక చిన్నారికి అర్హ‌త ఉన్నా ప‌థ‌కాలు రాని వైనంపై ఇప్ప‌టికైనా యంత్రాంగం దృష్టి సారిస్తే మేలు అన్న‌ది సామాజిక కార్య‌క‌ర్త‌ల అభిప్రాయం.

శ్రీ‌కాకుళం జిల్లా న‌రస‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు బిడ్డ‌లు త‌మ ద‌య‌నీయ స్థితిని స్థానిక ఎమ్మెల్యే కృష్ణ‌దాసుకు చెప్పుకుని క‌న్నీటిప‌ర్యంతం అయ్యారు. అమ్మానాన్న లేని త‌మ‌కు అమ్మ ఒడి రావ‌డం లేద‌ని చెబుతూ.. కృష్ణ‌దాస్ కు త‌మ గోడు వినిపించుకున్నారు. ఆర్నెల్ల కింద‌ట చ‌నిపోయిన అమ్మానాన్న‌లు తిరిగి వ‌స్తారా ? మ‌రి వీళ్ల‌కు ఎందుకు అమ్మ ఒడి అంద‌డం లేదు అని ప్ర‌శ్నిస్తున్నారు స్థానికులు. అమ్మ‌మ్మ తాత‌య్య‌లే వీరికి సంర‌క్ష‌కులు. వారి పేర్లు చేర్చి అమ్మ ఒడి ఇవ్వాలి కానీ ఆ ప‌ని కూడా అధికారులు చేయ‌డం లేదు.

ఈ బిడ్డ‌ల‌కు వారే అన్నీ అయి సాకుతున్నారు. క‌నుక ఆ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని వేడుకుంటున్నారు స్థానికులు. ఈ మాట‌లు విన్న వెంట‌నే కృష్ణ‌దాసు చ‌లించింది పోయారు. శ్రీ‌కాకుళం జిల్లా, న‌ర‌స‌న్న‌పేట మండ‌లం, హ‌డ్కో కాల‌నీకి చెందిన త‌రుణ్ (ఐదో త‌ర‌గ‌తి), తేజ (మూడో త‌ర‌గ‌తి) దీన గాథ ఇది. ఇలాంటివారు ఇంకా ఉన్నారు. అర్హ‌త ఉన్నా ప‌థ‌కాలు అంద‌ని వారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్య‌త మీదే సీఎం గారూ అంటూ ఇక్క‌డి వారంతా వేడుకుంటున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వంలో భాగంగా ఓ విక‌లాంగుడు కూడా ఇదే విధంగా దాస‌న్న‌ను క‌లిసి త‌న గోడు చెప్పుకుని బోరున విల‌పించాడు. సింహాద్రి కిర‌ణ్ అనే విక‌లాంగుడు త‌న‌కు పింఛ‌ను రావ‌డం లేద‌ని త‌న‌ను ఆదుకోవాల‌ని విన్న‌వించాడు. ఈ దృశ్యం కూడా అక్క‌డివారిని క‌దిలించింది.

అధికారుల‌ను పిలిచి ఆదేశాలు ఇచ్చారు దాస‌న్న. కానీ త‌న‌కు వీలున్నంత త్వ‌ర‌గా పింఛ‌ను వ‌చ్చే విధంగా చూడాల‌ని మ‌రో మారు దాస‌న్న‌కు వేడుకున్నాడు. తాను ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా స‌ద‌రం ఇవ్వ‌డం లేదని వాపోయాడు. మ‌రి ! ఇలాంటి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశ‌గా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ కృషి చేస్తుందా లేదా ఇవి త‌మ ప‌రిధిలోకి రావ‌ని తేల్చేస్తుందా అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.