Begin typing your search above and press return to search.

భగ్గుమంటున్న బాలినేని : నా పైన భారీ కుట్ర అంటున్న మాజీ మంత్రి...?

By:  Tupaki Desk   |   27 Jun 2022 1:56 PM GMT
భగ్గుమంటున్న బాలినేని :  నా పైన భారీ కుట్ర  అంటున్న మాజీ మంత్రి...?
X
వైసీపీలో ఆయన పెద్ద తలకాయ. జగన్ కి దగ్గర బంధువు. ఇక ఆయన హవాకు తిరుగులేదు అని అనుకుంటారు. కానీ ఈ మధ్య జరిగిన మంత్రి వర్గ విస్తరణలో బాలినేని శ్రీనివాసరావు పదవి పోయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న బాలినేని ఒక్కసారిగా మాజీ మంత్రి అయిపోయారు. ఒక విధంగా ఇది ఆయనకే కాదు సన్నిహితులకు కూడా నమ్మశక్యం కాని విషయం. దాంతో ఆయన అలిగి కొంత అలజడి సృష్టించారు.

కానీ చివరకు జగన్ తో భేటీ తరువాత సర్దుకున్నారు. కానీ బాలినేనిలో మునుపటి జోష్ లేదని పార్టీలో గుసగుసలు ఉన్నాయి. అయితే ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఒక దశలో రాజకీయాల పట్ల వైరాగ్యం చూపించినా ఇపుడు మళ్ళీ తన ఇలాకలో జోరు చేస్తున్నారు. అయితే తాజాగా బాలినేని భగ్గుమంటున్నారు. తన మీద ఇంటా బయటా ఆరోపణలు చేస్తున్న వారి మీద మండిపడుతున్నారు.

విపక్షాలు విమర్శించడంలో అర్ధం ఉంది కానీ సొంత పార్టీలోని వారే తన వెనకాల చేస్తున్న పనులు కూడా తనకు తెలుసు అంటూ ఆయన బాంబు పేల్చారు. తాను తాగి అర్ధరాత్రి జనసేన మహిళకు ఫోన్ చేశాను అని ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఈ రకంగా ఆరోపణలు తన మీద రావడం వెనక మా పార్టీ వారూ ఉన్నారని ఆయన బాంబు పేల్చారు.

తన మీద తెర వెనక కుట్ర జరుగుతోంది అని కూడా బాలినేని సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ వారితో కొందరు వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారని, ఆ వివరాలు అన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ విషయాలను తాను జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ మీద ఆ పార్టీ వారి మీద కేసులను ఉప సంహరించుంటున్నామని బాలినేని చెప్పడం గమనార్హం. మొత్తానికి బాలినేని ఇష్యూ అయితే వైసీపీలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతోంది.

ఆయన మీద ఎవరు కుట్ర చేస్తున్నారు. బాలినేని వంటి బిగ్ షాట్ మీద సొంత పార్టీ వారే కుట్ర చేసేలా తెగించారు అంటే వారి వెనక ఉన్నదెవరు, అసలు బాలిరెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యారు, ఆయన ఎవరికి టార్గెట్ గా ఉన్నారు. ఇవన్నీ ప్రశ్నలే, జవాబులు తొందరలోనే వస్తాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, వైసీపీలో మజీ మంత్రి అయ్యాక బాలినేని సంఘర్షణ పడుతున్నారు అనే అంటున్నారు. చూడాలి మరి బాలినేనిలోని అగ్గి బద్ధలు అయితే పరిణామాలు ఎలా ఉంటాయో.