Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేకి జగన్‌ ప్రభుత్వం మరో షాక్‌!

By:  Tupaki Desk   |   15 Jan 2023 3:30 PM GMT
వైసీపీ ఎమ్మెల్యేకి జగన్‌ ప్రభుత్వం మరో షాక్‌!
X
నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. గత కొంతకాలంగా ఆయన తన సొంత ప్రభుత్వ పనితీరుపైన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపైన చేస్తున్న వ్యాఖ్యలకు మీడియా పెద్ద ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో తమ పార్టీ ఎమ్మెల్యేనే తమపై విమర్శలు చేయడం వల్ల ప్రజలకు చెడ్డ సంకేతాలు వెళ్తాయని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి స్థానంలో ఆ నియోజకవర్గం ఇన్‌చార్జిగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌ కుమార్‌ రెడ్డిని నియమించింది. తద్వారా ఆనంను పొమ్మనకుండా పొగ బెట్టిందని వార్తలు వచ్చాయి.

వాస్తవానికి ఆనం రామనారాయణరెడ్డి తానేమీ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదని చెబుతున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాది కూడా లేదని.. గ్రామాల్లో సచివాలయాల నిర్మాణం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని మాత్రమే కోరుతున్నానంటున్నారు. అలాగే రోడ్లకు మరమ్మతులు చేయాలని సూచిస్తున్నారు. లేదంటే పథకాల రూపంలో డబ్బులించినంత మాత్రాన ప్రజలు ఓటేయరని మాత్రమే తాను చెప్పానంటున్నారు. చంద్రబాబు సైతం గత ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో రూ.10 వేల చొప్పున ఇచ్చినా ప్రజలు ఓడించారని గుర్తు చేస్తున్నారు. తాను ఇదే విషయాన్ని అధికారులకు, కాంట్రాక్టర్లకు చెప్పి పనులు చేయాలని కోరుతున్నానని అంటున్నారు.

అయితే ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలను వైసీపీ ప్రభుత్వం మాత్రం సీరియస్‌ గా తీసుకుందని చెబుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో చేరి ఆత్మకూరు నుంచి బరిలోకి దిగుతారని టాక్‌ నడుస్తోంది. ఆయన పోటీ చేయకుంటే ఆయన కుమార్తె కైవల్యా రెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆనంపై వేటు వేయకుండా ఆయనే పార్టీలో నుంచి పోయేటట్టు వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆనం రామనారాయణరెడ్డి భద్రతను కుదించిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆనంకు 2+2 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత కల్పిస్తుండగా.. దాన్ని 1+1కు కుదించడం గమనార్హం. వాస్తవానికి ఈ 1+1 భద్రత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆనంకు ఉంది.

ఇలా ఒక్కొక్కటిగా ఆనం రామనారాయణరెడ్డి పవర్‌ ను, సౌకర్యాలను కట్‌ చేస్తూ వస్తోంది.. వైసీపీ అధిష్టానం. ఇందులో భాగంగానే ఆయనను నియోజకవర్గ ఇన్‌చార్జిగా తప్పించి నేదురుమల్లి రామ్‌ కుమార్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం, ఆనం భద్రతను కుదించడం చేసిందని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.

మరోవైపు నెల్లూరు జిల్లాలోనే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కు భద్రత పెంచడం గమనార్హం. ప్రస్తుతం అనిల్‌ కు 1+1 భద్రత ఉండగా.. ఆయన భద్రతను 2+2కు పెంచడం విశేషం. ఈ నేపథ్యంలో తన భద్రత కుదింపుపై ఆనం రామనారాయణరెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.