Begin typing your search above and press return to search.

ఏడాది ముందే ఎన్నిక‌లు ఖాయ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   4 Sep 2017 5:29 AM GMT
ఏడాది ముందే ఎన్నిక‌లు ఖాయ‌మ‌ట‌!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగి ఇప్ప‌టికి మూడేళ్లు దాటిపోతోంది. క‌నీసం మ‌రో ఏడాదిన్న‌ర త‌ర్వాత గానీ దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌దిత‌ర నేత‌లు ఎన్నిక‌లు నిర్దేశిత గ‌డువు కంటే ముందుగానే జ‌రిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న కోణంలో ప‌లు సంద‌ర్భాల్లో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన వైనం మ‌న‌కు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ త‌రహా ప్ర‌క‌ట‌న‌లు ఆ ఇద్ద‌రు నేత‌ల నుంచి వినిపించ‌డం లేద‌నే చెప్పాలి. మ‌రి ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు వినిపించ‌ని ప్ర‌స్తుత త‌రుణంలో ముందస్తు ఎన్నిక‌ల మాట ఎలా వ‌చ్చిందంటారా? ఏలిన వారి మాట‌ల‌ను అప్పుడ‌ప్పుడు గుర్తు చేస్తున్న కొంద‌రు యువ నేత‌లు... భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌ను, ప‌రిణామాల‌ను అప్పుడ‌ప్పుడూ ప్ర‌స్తావిస్తూనే ఉంటారు.

అలాంటి భావ‌న‌తోనే వైసీపీ కీల‌క నేత‌ - ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న రాజంపేట పార్ల‌మెంటు స‌భ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ ద‌ఫా... ఈ ప్ర‌స్తావ‌న‌ను తెర మీద‌కు తెచ్చారు. చిత్తూరు జిల్లాలో మంచి ప‌ట్టు ఉన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెందిన మిథున్ రెడ్డి.. ఆది నుంచి జ‌గ‌న్‌ తోనే సాగుతున్నారు. జ‌గ‌న్ పార్టీ ప్రారంభించ‌గానే ఆయ‌న‌తో పాటే అడుగు క‌లిపిన మిథున్ రెడ్డి... పార్టీ నిర్మాణంలో కీల‌క భూమిక పోషించార‌నే చెప్పాలి. చిత్తూరులోని కొన్ని అసెంబ్లీలు - క‌డ‌ప జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల క‌ల‌యిక‌తో ఏర్ప‌డ్డ రాజంపేట లోక్ స‌భ స్థానం నుంచి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మిథున్ రెడ్డి... టీడీపీ - బీజేపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిపై భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. అప్ప‌టికే ఎన్టీఆర్ కుమార్తెగా జ‌నంలో మంచి పేరు తెచ్చుకున్న పురందేశ్వ‌రి కేంద్ర మంత్రిగానూ త‌న‌దైన స‌త్తా చాటి జ‌నంలో మంచి మైలేజీనే సాధించారు. అయినా మిథున్ రెడ్డి ప్ర‌జాద‌ర‌ణ ముందు ఆమె నిలువ‌లేక‌పోయార‌నే చెప్పాలి.

యువ‌నేత‌గా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన తొలి ఎన్నిక‌లోనే మిథున్ రెడ్డి లోక్ స‌భ‌లో అడుగుపెట్టి... త‌న‌దైన శైలిలో రాణిస్తున్నారు. చిత్తూరు జిల్లాతో పాటు క‌డ‌ప జిల్లాలోని ప‌లు నియోజ‌కవ‌ర్గాల పార్టీ బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న మిథున్ రెడ్డి నిన్న చిత్తూరు జిల్లా తంబ‌ళ్ల‌పల్లె నియోజక‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఎంతో స‌మ‌యం లేద‌ని, నిర్దేశిత గ‌డువు క‌న్నా ఏడాది ముందుగానే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. *ఒకే దేశం–ఒకే ఎన్నిక* పేరిట ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వినిపిస్తున్న కొత్త‌ నినాదాన్ని చూస్తే... 2018లో ఎన్నికలు రావచ్చన్న సంకేతాలు కన్పిస్తున్నాయని తెలిపారు.