Begin typing your search above and press return to search.

అమరావతికి మొక్కుకుని పదవి పోగొట్టుకున్న వైసీపీ మంత్రి?

By:  Tupaki Desk   |   10 Sept 2022 6:23 PM IST
అమరావతికి మొక్కుకుని పదవి పోగొట్టుకున్న వైసీపీ మంత్రి?
X
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతి అంశం మళ్లీ చర్చనీయాంశం అవుతోంది. అమరావతి రైతుల మహా పాదయాత్ర మొదలు నేపథ్యంలో అందరి కళ్లూ అటువైపే నిలిచాయి. న్యాయస్థానం కూడా మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో అడ్డంకులన్నీ తొలగినట్టయింది. అమరావతి రైతులు నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్రకు సహేతుకమైన షరతులతో అనుమతివ్వాలని ఏపీ డీజీపీని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. యాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించడాన్ని తప్పుపట్టింది కూడా.

అమరావతి రైతు ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా ఈ నెల 12 నుంచి నవంబర్‌ 11 వరకు అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, ఎ.శివారెడ్డి హైకోర్టులో వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. కాగా, అమరావతిపై ఇటీవల ఒకరు రాసిన పుస్తకం విడుదలకు మాజీ సీఎం చంద్రబాబు, సీనియర్ బీజేపీ నేత లక్ష్మీనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, అమరావతి రాజధాని ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు, శ్రీనివాసరావు, తులసిరెడ్డి చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.

ఎవరా నేత? పుస్తకావిష్కరణ సందర్భంగా శ్రీనివాసరావు ప్రసంగం ఓ ప్రవాహంగా సాగింది. అమరావతి గురించి ఢిల్లీలో పార్లమెంటులో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు స్థానికంగా జరిగిన రాజకీయ
వ్యవహారాలను ఆయన చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల ఏపీలో ఓ మంత్రి పదవి కోల్పోవడానికి ఆయన 'అమరావతి రాజధానిగా ఉండాలని'మొక్కుకోవడమే కారణమని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఈ విషయంలో ఆ మంత్రి.. చంద్రబాబును తిట్టేవారంటూ మరో క్లూ కూడా ఇచ్చారు. దీనిని సభా వేదికపైనే ఉన్న చంద్రబాబు సావధానంగా వింటూ వచ్చారు.

ఎప్పుడు చోటుచేసుకుందా ఘటన? కొలికపూడి శ్రీనివాసరావు చెప్పినదాని ప్రకారం.. ఆ మంత్రి మాజీ కాకముందు కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. కుటుంబంమో, అనుచరులో కానీ.. మొత్తం పదిమంది ఆ మాజీ మంత్రి వెంట ఉన్నారు. ఏడు కొండల వాడి దర్శనం అనంతరం వెంట వచ్చినవారు ఆ మాజీ మంత్రిని ఏం మొక్కుకున్నారంటూ ప్రశ్నించారు. దీనికి ఆయన.. "అమరావతి రాజధానిగా ఉండాలని" కలియుగ దైవాన్ని వేడుకున్నట్లు చెప్పారు. ఈ విషయం ఎలాగో బయటకు వచ్చింది.

లేకుంటే పదవి ఉండేదా? ఒకవేళ ఆ మంత్రి గనుక అమరావతి విషయంలో కోరిక కోరుకోకపోయి ఉంటే.. మంత్రి వర్గంలో ఆయన స్థానం నిలిచి ఉండేదా? అని చర్చలు సాగుతున్నాయి. శ్రీనివాసరావు చెప్పినదానిని బట్టి చూస్తే అదే అనిపిస్తోంది. పునర్ వ్యవస్థీకరణలోనూ ఏపీ సీఎం జగన్ కొందరు మంత్రులను కొనసాగించారు. అయితే, సామాజిక సమీకరణాల ప్రకారం కచ్చితంగా పదవి ఉంటుందనుకున్న ఓ మంత్రిని మాత్రం తొలగించారు. ఇప్పుడు అమరావతి విషయంలో వ్యాఖ్యలు చేసింది ఆయనేనా? అని అనుమానం వస్తోంది. మరోవైపు ఇదే సమావేశంలో శ్రీనివాసరావు సహా తులసిరెడ్డి చేసిన ప్రసంగం కూడా యూట్యూబ్ లో బాగా ప్రజాదరణ పొందుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.