Begin typing your search above and press return to search.

మోసం చేసి వెళ్లిన వారికే ఏపీ సీఎం అపాయింట్స్?

By:  Tupaki Desk   |   22 Sept 2019 5:00 PM IST
మోసం చేసి వెళ్లిన వారికే ఏపీ సీఎం అపాయింట్స్?
X
బుట్టా రేణుక - ఎస్వీ మోహన్ రెడ్డి - ఆమంచి కృష్ణమోహన్.. ద్వారనాథ్ రెడ్డి.. వీళ్లకు ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ సులభంగా దొరికిన వైనం పై అనేక మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. వీళ్లంతా ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చిన వాళ్లు. వీరిలో కొందరైతే అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి ఫిరాయించారు. వైసీపీ గాలి ఉందని తెలుసుకుని వీళ్లు తిరిగి ఆ పార్టీ వైపు వచ్చారు.

అలాంటి వారికి ఎంచక్కా ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇప్పుడు దొరుకుతూ ఉందట. ఇటీవలే వీళ్లలో ఒక్కొక్కరుగా జగన్ ను కలిసి వచ్చి ఫొటోలను పత్రికల్లో వేయించుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఫిరాయింపుదారులకు - ద్రోహం చేసి వెళ్లిన వారికి ఇప్పుడు జగన్ అపాయింట్ మెంట్ సులభంగా లభిస్తోందని..అదే పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్న వారికి మాత్రం ఆయనను కలిసే అవకాశం ఈ మధ్య కాలంలో దొరకడం లేదని వినికిడి.

ఈ విషయంలో అలాంటి నేతలు ఆవేధన భరితులు అవుతున్నారు. తాము మొదటి నుంచి జగన్ వెంట నిలిచి ఉన్నా ఇప్పుడు కలవడానికి అవకాశం లభించడం లేదని, అయితే ద్రోహం చేసి - పార్టీ గాలి ఉన్న వేళ జగన్ వద్దకు చేరిన వారికి మాత్రం ఇప్పుడు సులభంగా అపాయింట్ మెంట్స్ లభిస్తూ ఉన్నాయని వారు వాపోతూ ఉన్నారు.

ముఖ్యమంత్రి బిజీగానే ఉండవచ్చు. కానీ అలాంటి వారికి మాత్రం అపాయింట్ మెంట్స్ దొరకడం - తమకు మాత్రం కలిసే అవకాశం దొరకకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారని తెలుస్తోంది.