Begin typing your search above and press return to search.

గడప గడప కార్యక్రమమే నిజమైన పరీక్షా ?

By:  Tupaki Desk   |   10 May 2022 2:30 AM GMT
గడప గడప కార్యక్రమమే నిజమైన పరీక్షా ?
X
అధికార పార్టీ ఎంఎల్ఏలు, మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, నేతలకు అసలైన పరీక్షలు ఎదురు కాబోతోందా ? అవుననే అనిపిస్తోంది. ఈనెల 11వ తేదీ అంటే బుధవారం నుంచి అధికార పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమం మొదలవ్వబోతోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంఎల్ఏలు, జిల్లాల అధ్యక్షులు పాల్గొనబోతున్నారు. అంటే ప్రభుత్వం తరపున అధికార పార్టీ నేతలు నేరుగా ప్రజల ముందుకు వెళ్ళటం ఇదే మొదటిసారి.

గడచిన మూడేళ్ళుగా ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరికీ వివరించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జగన్ మంత్రులు, ఎంఎల్ఏలను ఈ రకంగా ఆదేశించారు. ఎన్నికల్లో ప్రజల మద్దతును సంపాదించాలంటే అందరు జనాల్లోనే ఉండాలని, ప్రజల సంక్షేమంపై శ్రద్ధ పెట్టాలని జగన్ పదే పదే చెబుతున్నారు. మండుటెండల్లో, విద్యుత్ కొరతల నేపథ్యంలో నేతలు గడప గడపకు కార్యక్రమం పెట్టుకోవటం గమనార్హం.

మండుతున్న ఎండల్లో జనాలను నేతలు ఎలా ఫేస్ చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. నిజానికి మూడేళ్ళల్లో జనాలకు అందిన సంక్షేమ పథకాల గురించి మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు మళ్ళీ వివరించాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే ప్రభుత్వం నుంచి తాము అందుకున్న పథకాల లబ్ది ఏమిటో ప్రజలకు అంతమాత్రం గుర్తుండదా ? అయిపోయిన రామాయణం గురించి మళ్ళీ వినిపించే కన్నా భవిష్యత్తులో చేయబోయే వాటి గురించి వివరిస్తేనే జనాలు వింటారు.

పైగా జనాల యాటిట్యూడ్ ఎలాగుంటుందంటే అందుకున్న వాటి గురించి వదిలేసి అందని దాని గురించే ఆలోచిస్తుంటారు. ప్రజలను తొమ్మిది సందర్భాల్లో ఆదుకుని పదో సందర్భంలో ఆదుకోలేకపోతే దాన్ని మాత్రమే జనాలు గుర్తుంచుకుంటారు.

ఇచ్చిన వాటి విషయంలో ఎవడబ్బ సొమ్ము ఇచ్చాడని అడుగుతారు. ఇవ్వలేకపోయిన దాన్ని మాత్రం ఎందుకు ఇవ్వలేకపోయాడని నిలదీస్తారు. ఇదంతా మామూలుగా జరిగేదే. అయితే ప్రజలను అధికార పార్టీ నేతలు ఏ విధంగా కన్వీన్స్ చేస్తారనేదే కీలకం. రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. సో గడప గడపకు కార్యక్రమం అసలైన పరీక్షగా నిలవబోతోంది.