Begin typing your search above and press return to search.

ఏపీ సభాపతి ఎదుటే.. ఒకరినొకరు తోసేసుకున్నారే!

By:  Tupaki Desk   |   26 Jun 2020 7:50 AM GMT
ఏపీ సభాపతి ఎదుటే.. ఒకరినొకరు తోసేసుకున్నారే!
X
అప్పటి వరకు ప్రజా ప్రతినిధే కావొచ్చు. ఒక్కసారి సభాపతి పీఠం మీద కూర్చున్న తర్వాత పార్టీ జెండాలకు.. ఎజెండాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాంటి విలువలకు చెల్లుచీటి ఇచ్చేసి చాలాకాలమే అయ్యింది. సభాపతిగా బాధ్యతలు చేపట్టిన చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాదు.. పార్టీకి సంబంధించిన అంశాలకు అతీతంగా వ్యవహరించేవారు.

తాను ప్రాతినిధ్యం వహించే పార్టీకి సంబంధించిన చోటా నేతల మధ్య పంచాయితీలకుదూరంగా పెట్టటమేకాదు.. సభాపతి ముందు రాజకీయాల్ని నడిపే సాహసం చేసే వారు కాదు. మారిన కాలానికి తగ్గట్లే.. ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. అందుకు నిదర్శనంగా శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఏపీ అధికారపక్ష నేతల మధ్య సాగిన పరిణామాలే నిదర్శనంగా చెప్పాలి.

పొందూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో తాజాగా పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అలాంటికార్యక్రమాన్ని నిర్వహించటమా? అంటే.. కొన్నిసార్లు అలా జరిగిపోతుంటాయంతే. ఇళ్ల పట్టాలకు సంబంధించి కొంతమంది అర్హుల పేర్లు లిస్టులో లేవని స్థానిక నేత ఒకరు ప్రస్తావించారు. దీంతో.. అక్కడే ఉన్న ఆయన వైరి వర్గానికి చెందిన పెద్ద మనిషికి కోపం కట్టలు తెంచుకుంది. అంతే.. గొడవ మొదలు కావటమే కాదు.. ఒకరిని ఒకరు అరుచుకోవటం.. తిట్టుకోవటమే కాదు.. పరిస్థితి చేజారి బాహాబాహీ వరకూ వెళ్లే పరిస్థితి. పరిస్థితి బాగోలేదన్న విషయాన్ని గుర్తించిన సభాపతి ఇరు వర్గాల్ని శాంతింపచేసే ప్రయత్నం చేశారు.

అతి కష్టమ్మీదా పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. దీంతో.. ఇరువర్గాలకు నచ్చజెప్పి సభాపతి వెళ్లిపోయారు. ఆయన వెళ్లినంతనే మళ్లీ రెండు వర్గాల వారు వాదులాడుకోవటమే కాదు.. కొట్టుకునే వరకూ వెళ్లారు. దీంతో.. అక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు జోక్యం చేసుకొని ఇరు వర్గాల్ని శాంతింపచేశారు. సభాపతి ఎదుట పార్టీ పంచాయితీల వరకూ వెళ్లిన వైనం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పంచాయితీల్ని ఎక్కడికక్కడ.. ఎప్పటికప్పుడు సెట్ చేయకుంటే పార్టీ పరపతి బజారున పడటం ఖాయమని చెప్పక తప్పదు.