Begin typing your search above and press return to search.

అగ్రిగోల్డ్ డొంక పుల్లారావు ఇంట్లో కదిలిందా?

By:  Tupaki Desk   |   12 Oct 2015 1:42 PM IST
అగ్రిగోల్డ్ డొంక పుల్లారావు ఇంట్లో కదిలిందా?
X
కారణాలేవైతేనేం.. అగ్రిగోల్డ్ ను ఒక పట్టుపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తమ పార్టీ నేతల కారణంగానే విమర్శలు ఎదుర్కొంటోంది. ఏపీ మంత్రులకూ అగ్రిగోల్డ్ లో వాటాలున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ మంత్రి పుల్లారావు తన భార్య పేరు మీద తక్కువ ధరకు ఇందులో వాటాలు కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నారు... ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు చేయించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా ప్రకాశం జిల్లాలోని గురిజేపల్లి దగ్గర అగ్రిగోల్డ్‌కు సంబంధించి 15 ఎకరాలను తన భార్య వెంకాయమ్మ పేరుతో మంత్రి కొనుగోలు చేశారన్నది వైసీపీ నేతల ఆరోపణ.

మోసకారి ఆర్థిక సంస్థలో వాటాలున్న కారణంగా ప్రత్తిపాటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వైసీపీ డిమాండు చేస్తోంది. ప్రభుత్వం స్పందించకపోతే దస్తావేజుల ఆధారాలతో సీఐడీకి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతల ఆరోపణలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. జగన్ దీక్షలో నిజాయితీ లేదని, అందుకే ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. క్యారెక్టర్ లేనివాళ్లు చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకు... జగన్ దీక్షకు సంబంధమేమిటో మరి మంత్రిగారే చెప్పాల్సిఉంది.