Begin typing your search above and press return to search.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

By:  Tupaki Desk   |   29 Aug 2016 6:42 AM GMT
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు
X
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే సంకేతాలివ్వడంతో తెలుగుదేశం పార్టీ ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన సంకేతాలతో సీనియర్లతోపాటు, కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో అరడజనుకు పైగా మంత్రులకు ఊస్టింగు తప్పదని భావిస్తుండడంతో వారి స్థానాన్ని తాము ఆక్రమించుకోవాలన్న ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. వైసీపీనుంచి వచ్చినవారిలో ముగ్గురికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో స్పీకర్ కోడెలకు ఈసారి న్యాయం చేస్తారని వినిపిస్తోంది. కోడెలకు ప్రాధాన్యం ఉన్న కాలంలో గుంటూరు - ప్రకాశం జిల్లాల్లో పార్టీ బలంగా ఉండేదని.. ఇప్పుడు అక్కడ పార్టీ పరిస్థితి ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉందని.. వర్గ పోరాటాలతో పార్టీ ముక్కలుముక్కలవుతోందని చంద్రబాబును అనుకుంటున్నారట. ఆ కారణంగా కోడెల వంటి సమర్థులకు మంత్రి పదవి ఇచ్చి యాక్టివేట్ చేస్తే రెండు మూడు జిల్లాలను ఆయన దారిలో పెడతారని భావిస్తున్నారు. అంతేకాకుండా... ప్రస్తుత మంత్రివర్గంలో ఒకరిద్దరు తప్ప సమర్థులు లేరన్న భావన కూడా చంద్రబాబులో ఉందని.. సీనియర్లు కొందరు ఉన్నా పనితీరు బాగులేకపోవడం వంటి కారణాల వల్ల కోడెలను మంత్రివర్గంలోకి తీసుకుంటే ప్రయోజనకరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి కోడెలకు మంత్రి పదవి ఖాయమని వినిపిస్తోంది.

మరోవైపు మంత్రి నారాయణను తప్పించవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు సిఆర్‌ డిఏ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌ డిఏ చైర్మన్‌ గా ఉన్నారు. మంత్రి పదవినుంచి తప్పించినప్పటికీ, ఈ పదవి ఇవ్వడం ద్వారా ఆయనను సంతృప్తి పరచనున్నట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిశోర్‌ బాబు - పుల్లారావు ఇద్దరినీ తప్పించవచ్చంటున్నారు. రావెల విఫలమయ్యారన్న విమర్శలతోపాటు - పుల్లారావు కుటుంబసభ్యులపై ఆరోపణలు వారి తొలగింపునకు కారణం కావచ్చంటున్నారు. పుల్లారావు స్థానంలో కమ్మ సామాజిక వర్గం నుంచి ధూళిపాళ్ల నరేంద్రకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావుకు ఊస్టింగు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

మంత్రి మృణాళిని తప్పించడం ఖాయమని - పీతల సుజాతను కొనసాగించినా ఆమె ప్రాధాన్యం తగ్గించవచ్చంటున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రాధాన్యం తగ్గించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. హోంమంత్రి చినరాజప్ప శాఖ మార్చవచ్చంటున్నారు. రావెల స్థానంలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అనంతపురంనుంచి పయ్యావుల కేశవ్‌ కు స్థానం కల్పించాలనుకుంటే పల్లె - పరిటాలలో ఒకరిని తప్పించాల్సి ఉంది. వైసీపీ నుంచి ఇటీవల పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ - సుజయ కృష్ణ రంగారావు - భూమాలకు క్యాబినెట్ బెర్తులు ఖాయమంటున్నారు. జలీల్‌ ఖాన్‌ కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని, ఒకవేళ ఆ జిల్లా నుంచి అవకాశం లభిస్తే జగ్గయ్యపేట సీనియర్ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు వస్తుందంటున్నారు.