Begin typing your search above and press return to search.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఘర్ వాపసీల ఊపు!

By:  Tupaki Desk   |   16 March 2019 2:39 PM GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఘర్ వాపసీల ఊపు!
X
మొదట్లో కొంత కాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆ పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలోకి చేరిపోయారు. ఇలాంటి వారు ఒకరిద్దరు కాదు చాలా మందే కనిపిస్తూ ఉండటం విశేషం. ఎన్నికల వేళ వీళ్ల సంగతులు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఆ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. కాటసాని రాంభూపాల్ రెడ్డి - దాడి వీరభద్రరావు - కొణతాల రామకృష్ణ - బుట్టా రేణుక - గురునాథ్ రెడ్డి లాంటి వారు కనిపిస్తారు.

కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పుడు కాదు..జగన్ పార్టీ పెట్టిన కొత్తలోనే ఆయన వెంట నడిచారు. కాంగ్రెస్ ను వీడటానికి రెడీ అయ్యి జగన్ వెంట నడవడానికి రెడీ అయిన వారిలో కాటసాని ఒక ఎమ్మెల్యే. అయితే కాటసాని ఆ తర్వాత జగన్ కు దూరం అయ్యారు. అదెందుకో తిరిగి వైసీపీలో చేరిన తర్వాత కాటసాని చెప్పారు. కిరణ్ ప్రభుత్వాన్ని కూలదోయమని తాము జగన్ కు సూచించామని, అయితే ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశం జగన్ కు లేదని అర్థమయ్యాకా తాము జగన్ కు దూరం అయ్యామని కాటసాని వివరించారు.

గత ఎన్నికల్లో కాటసాని ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. అక్కడా ఇమడలేక చివరకు జగన్ చెంతకే చేరారు. ఈ ఎన్నికల్లో ఆయనకు పాణ్యం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఖరారు అయ్యింది.గత ఎన్నికల్లో పాణ్యం నుంచి ఇండిపెండెంట్ గా తన సత్తా చూపించిన కాటసాని ఈ సారి వైసీపీ తరఫున నెగ్గడం నల్లేరు మీద నడకే అని విశ్లేషకులు అంటున్నారు.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. కాంగ్రెస్ నుంచి నుంచి బయటకు వచ్చి, జగన్ వెంట కష్టకాలంలో నిలిచి..అనూహ్యంగా పార్టీమారిన వ్యక్తి అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి. ఈయన జగన్ వెంట్ తొలి తొలిగా వచ్చిన ఎమ్మెల్యేల్లో ఒకరు. ఉప ఎన్నికల్లో నెగ్గారు. అయితే గత ఎన్నికల్లో ఓడారు. అయితే కొంతకాలం కిందట ఈయన తెలుగుదేశంలో చేరారు. టీడీపీలోకి ఎందుకు చేరారో.. ఎందుకు బయటకు వచ్చారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం అయితే వైసీపీలోనే ఉన్నారు. ఈయనకు జగన్ ఎక్కడా టికెట్ ఖరారు చేయలేదు.

ఇదే కోవకు చెందిన వారు.. కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు కూడా, వీరు గత ఎన్నికల ముందు వైసీపీలో యాక్టివ్ గా వ్యవహరించారు. అయితే ఎన్నికల తర్వాత వీరు వైసీపీ కార్యకలాపాలకు దూరం అయ్యారు. ఇప్పుడు మళ్లీ వైసీపీలోకి చేరిపోయినట్టే ఈ నేతలు.

ఇదే జాబితాలోకి చేరారు బుట్టా రేణుక కూడా. ఆమె గత ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎంపీగా నెగ్గారు. అయితే అనంతరం కొంతకాలం పాటు వైసీపీలో చేరి చివరకు ఫిరాయించారు. ఇప్పుడు.. ఆమె కూడా మళ్లీ వైసీపీలోకి చేరిపోయారు. పొలిటికల్ ఘర్ వాపసీలు అనాలేమో ఈ చేరికలను!