Begin typing your search above and press return to search.

జంపింగే... వారికి అర్హ‌త అయ్యింది!

By:  Tupaki Desk   |   2 April 2017 7:16 AM GMT
జంపింగే... వారికి అర్హ‌త అయ్యింది!
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌న కేబినెట్‌ను తొలిసారిగా పున‌ర్వ‌వ‌స్థీక‌రించారు. ఈ రీష‌ఫిలింగ్‌ లో ఐదుగురు మంత్రుల‌ను తొల‌గించేసిన చంద్ర‌బాబు... కొత్త‌గా 11 మందికి అవ‌కాశం క‌ల్పించారు. కొత్త మంత్రుల చేత తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ వెల‌గ‌పూడిలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక వేదిక మీద ప్ర‌మాణం చేయించారు. చంద్రబాబు కేబినెట్‌ లోకి కొత్త‌గా చేరిన ఈ 11 మంది నేత‌ల‌కు ఉన్న అర్హ‌త‌ల‌ను ప‌రిశీలిస్తే... ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. ఈ 11 మంది కొత్త మంత్రుల్లో న‌లుగురు మాత్రం వైసీపీ టికెట్‌ పై ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించి... ఆ త‌ర్వాత టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు లొంగిపోయిన 21 మందిలో ఉన్న‌వారే. వారే భూమా అఖిల‌ప్రియ‌ - ఎన్‌.అమ‌ర్‌ నాథ్ రెడ్డి - ఆదినారాయ‌ణ‌రెడ్డి - సుజయ‌కృష్ణా రంగారావు.

రాయ‌ల‌సీమ‌కు చెందిన మొద‌టి ముగ్గురు ఎమ్మెల్యేలు స‌హా... ఉత్త‌రాంధ్ర‌కు చెందిన సుజ‌యకు ఉన్న అర్హ‌త‌లేమిట‌న్న అంశాన్ని ప‌రిశీలిస్తే... కేవ‌లం త‌న‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మోసం చేసి... టీడీపీలో చేరిపోవ‌డ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. భూమా అఖిల ప్రియ‌... ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యేనే. పెద్ద‌గా రాజకీయాల్లో అనుభవం కూడా లేదు. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌చారం ముగించుకుని ఇంటికి తిరిగివెళుతున్న స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాదంలో భూమా శోభానాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. అప్ప‌టిదాకా రాజకీయ వాస‌న‌లే తెలియ‌ని భూమా అఖిల‌ప్రియ అప్ప‌టిక‌ప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశారు. భూమా కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌న్న భావ‌న‌తో రాజ‌కీయాల‌కు కొత్త అయినా కూడా అఖిల‌ప్రియ‌కే టికెట్ ఇచ్చేందుకు జ‌గ‌న్ మొగ్గుచూపారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి జ‌గ‌న్ అండాదండ‌గా నిల‌బ‌డ్డారు. అయితే టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు లొంగిపోయి... చిన్న వ‌య‌సులోనే త‌న‌ను అసెంబ్లీకి పంపిన జ‌గ‌న్‌ కు షాకిస్తూ... అఖిల‌ప్రియ త‌న తండ్రి భూమా నాగిరెడ్డితో క‌లిసి టీడీపీలో చేరిపోయారు.

ఇక ఆ త‌ర్వాత విడ‌త‌ల‌వారీగా జ‌రిగిన జంపింగుల్లో ఆదినారాయ‌ణ‌రెడ్డి - అమ‌ర్‌ నాథ్‌ రెడ్డి - సుజ‌య‌కృష్ణా రంగారావు స‌హా 21 మంది ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌కుండానే టీడీపీలో చేరిపోయారు. ఈ 21 మందిలో ఇప్పుడు భూమా - సుజ‌య‌ - ఆది - అమ‌ర్‌ ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. వీరికున్న అర్హ‌త కేవ‌లం జ‌గ‌న్‌ ను వ్య‌తిరేకించ‌డ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ న‌లుగురిలో అమ‌ర్‌ నాథ్ రెడ్డి సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ... మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం మాత్రం ఇదే ఫ‌స్ట్ టైమ్‌. ఇక ఆదినారాయ‌ణ రెడ్డి విష‌యానికి వస్తే... జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో జ‌గ‌న్‌ కు వ్య‌తిరేకంగా ముందుకు సాగ‌డ‌మే ఆయ‌న‌కు ఉన్న ఏకైక అర్హ‌త‌గా చెబుతున్నారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీ ఆది నుంచి అండ‌గా నిల‌బ‌డ్డ మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి ఉన్నా... ఆయ‌న‌ను బుజ్జ‌గించి మ‌రీ ఆదికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం వెనుక ఉన్న అస‌లైన కార‌ణం... జ‌గ‌న్ ప‌ట్ల ఆయ‌న‌కున్న వ్యతిరేక‌త‌నేన‌ని చెప్ప‌క త‌ప్ప‌ద‌న్న విశ్లేష‌ణ లేక‌పోలేదు.

ఇక సుజ‌య విష‌యంలోనూ ఇదే వాద‌న వినిపిస్తోంది. ఉత్త‌రాంధ్ర‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌... గ‌తంలో వైసీపీలో కీల‌క నేత‌గానే ఉన్నారు. అయితే మంత్రి ప‌ద‌విని ఎర వేసిన కార‌ణంగానే ఆయ‌న టీడీపీలో చేరిన‌ట్లు నాడు పుకార్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే... సుజ‌య ఎక్క‌డ తిరిగి వైసీపీలో చేరిపోతారోన‌న్న భ‌యంతోనే ఆయ‌న‌కు కేబినెట్ బెర్తును చంద్ర‌బాబు ఇచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అంటే... ఈ న‌లుగురు కొత్త మంత్రుల‌కు కేబినెట్ బెర్తులు ద‌క్క‌డానికి ఒకే ఒక్క కార‌ణం ప‌నిచేసింద‌ని, అదే జ‌గ‌న్ ప‌ట్ల వ్య‌తిరేక‌త చూప‌డ‌మేన‌ని తేలిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/