Begin typing your search above and press return to search.

వంద నియోజకవర్గాల్లో వైసీపీ షాక్... ?

By:  Tupaki Desk   |   31 Jan 2022 9:00 AM IST
వంద నియోజకవర్గాల్లో వైసీపీ షాక్... ?
X
ఏపీలో అధికార పార్టీ అన్ని ఎన్నికల్లో గెలిచేసింది. 2019 నుంచి 2021 వరకూ చూసుకుంటే జరిగిన ప్రతీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. దాంతో ఈ ఎన్నిక అయినా అదే సీన్ రిపీట్ అని వైసీపీ నేతలు ఒక వైపు జబ్బలు చరుస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో సీన్ అలా ఉందా అంటే డౌట్లు వేయి కొడుతున్నాయిట. నిజంగా లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఏ పార్టీ బలానికి సిసలైన కొలమానం కావని అంటారు.

ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ సైడే జనాలు మొగ్గు చూపుతారు. ప్రత్యర్ధిని తెచ్చి పెట్టుకుని తమ ఊళ్ళో అభివృద్ధిని ఆపుకోరు. దానికి తోడు అధికార పార్టీ దగ్గర అనేక వనరులు ఉంటాయి. దాంతో గెలుపు ఈజీ అవుతుంది. అయితే ఈ విజయాలు ఎపుడు సార్వత్రిక ఎన్నికలలో గెలుపు గ్యారంటీ అని చెప్పలేవు. దానికి గట్టి ఉదాహరణ 2017లో నంద్యాలలో గెలిచిన టీడీపీ 2019లో ఏకంగా అక్కడే కాకుండా ఏపీలో దారుణంగా ఓడిపోవడమే అంటారు.

ఇవన్నీ పక్కన పెడితే పార్టీగా బలంగా ఉంటే అధికారం ఎపుడైనా ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యపడుతుంది. ఆ విధంగా అన్నీ కలసి వచ్చి 2019లో వైసీపీ విజయం సాధించింది. అయితే మూడేళ్ళ పాలనలో జగన్ పూర్తిగా ప్రభుత్వం మీదనే ఫోకస్ పెట్టేశారు. దాంతో పార్టీ స్థితిగతులు చూసేవారు లేకుండా పోయారు. అంటున్నారు. నిజం చెప్పాలంటే వైసీపీ ప్లీనర్ జరిగి ఈ జూలై నాటికి కచ్చితంగా అయిదేళ్ళు అవుతోంది.

అలాగే పార్టీకి కమిటీలు కూడా వేసి ఎన్నేళ్లు అయిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. పార్టీ కార్యవర్గాల గురించి ఎవరికీ కూడా తెలియని పరిస్థితి అంటున్నారు. ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా జగన్ ద్విపాత్రాభినయం చేస్తున్నా ఆయన చూపు మాత్రం సర్కార్ మీదనే ఉందని, దాంతో పార్టీని పట్టించుకునే వారే లేకుండా పోయారు అంటున్నారు.

వైసీపీ పవర్ లోకి వచ్చాక చాలా మందికి పదవులు వచ్చాయి. కానీ వచ్చిన పదవులు నచ్చని వారు ఉంటే తమకు రాలేదని ఇంకా మూలిగే వారు చాలా మంది ఉన్నారు. మరో వైపు తమ హోదాకు సరిపడా అవకాశాలు లేవని అలిగే వారూ ఉన్నారు. మరో వైపు చూస్తే ఎంపీలూ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా చాలా జిల్లాల్లో ఉంది. అలాగే ఎమ్మెల్యేలకు ఇతర నేతలకు పొసగడంలేదు.

ఈ క్రమంలో చూసుకుంటే దాదాపుగా వంద నియోజకవర్గాల్లో వైసీపీలో ఆధిపత్య పోరు చాలా గట్టిగానే సాగుతోంది అంటున్నారు. వాటి మీద ఆర్చే వారూ తీర్చేవారు కనిపించడంలేదు అంటున్నారు. ఇలాంటి వాటిలో విశాఖ జిల్లా పాయకరావు పేటలో ఒకటి బయటపడి రచ్చ రచ్చ అయింది. ఏకంగా తమ సొంత ఎమ్మెల్యేకు వ్యతిరేకంగానే నేతలు రోడ్డెక్కారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నా పార్టీ గురించి పెద్దలు పట్టించుకోవడంలేదు అంటున్నారు.

ఈ నేపధ్యంలో 13 జిల్లాలు కాస్తా 26 అయ్యాయి. దాంతో మొత్తానికి మొత్తం పార్టీని ప్రక్షాళన చేసుకుని వర్గ పోరుని చల్లార్చకపోతే మరో రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని పార్టీలో వినిపిస్తున్న మాట. అంతిమంగా పార్టీని పటిష్టం చేసుకోకపోతే రాజకీయంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు.