Begin typing your search above and press return to search.

అంతర్వేది ఎపిసోడ్ పై సర్కారు సీరియస్.. వరుస పెట్టి నిర్ణయాలు

By:  Tupaki Desk   |   9 Sept 2020 10:30 AM IST
అంతర్వేది ఎపిసోడ్ పై సర్కారు సీరియస్.. వరుస పెట్టి నిర్ణయాలు
X
తప్పు జరిగినా.. జరగనట్లుగా వ్యవహరిస్తూ.. చూసిచూడనట్లుగా వ్యవహరించే తీరు కొంతమంది పాలకులకు ఉంటుంది. తప్పు జరిగితే.. ఏ మాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవటం మరో ఎత్తు. ఈ రెండింటికి భిన్నంగా రాజకీయ ఎదురుదాడిని ఎదుర్కొంటూనే.. విమర్శలకు వెరవకుండా చర్యలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు ఏపీలోని జగన్ సర్కారు.

సంచలనంగా మారిన తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం మంటల బారిన పడటం తెలిసిందే. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన నేపథ్యంలో.. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా చర్యల కత్తి బయటకు తీసింది. ఇప్పటికే జరిగిన ఘటనపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందన్న విషయాన్ని పోలీసు అధికారుల స్పందనతో ఇప్పటికే వెల్లడైంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభుత్వం సంచలన నిర్ణయాల్ని తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ సీనియర్ ఐఏఎస్ అధికారిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. అంతర్వేది దేవస్థానం కార్యనిర్వాహణ అధికారినీ విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వీరిద్దరిని ప్రాధాన్యత లేని విభాగాలకు పంపుతూ నిర్ణయం తీసుకోవటం ద్వారా.. అలక్ష్యంపై చర్యలు ఎలా ఉంటాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థకు డైరెక్టర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. ఇక.. అంతర్వేది ఆలయ కార్యనిర్వాహణాధికారి చక్రధర రావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారిని ఇన్ ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దేవస్థానం రథం దగ్థం కావటంపై రాజకీయంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. ప్రభుత్వం తీసుకునే చర్యలతో తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.జరిగిన తప్పును సరిదిద్దేందుకు విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకెళ్లటమే చేయాలే తప్పించి.. చూస్తూ ఊరుకోవటం ఏ మాత్రం మంచిది కాదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. జరిగిన ఘటనపై నిజాయితీగా చర్యలు తీసుకుంటే.. రాజకీయ పార్టీలు తప్పు పట్టే అవకాశం ఉంటుందేమో కానీ.. ప్రజలు హర్షిస్తారన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ పెద్దల మాటగా చెబుతున్నారు. అందుకే.. చర్యల కత్తికి పదును తేల్చి మరీ వేటు మీద వేటు వేయటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.