Begin typing your search above and press return to search.

సమాచారం ఏంటి లోకేశ్.. ఆధారాలు చూపించొచ్చుగా?

By:  Tupaki Desk   |   31 Oct 2020 12:40 PM IST
సమాచారం ఏంటి లోకేశ్.. ఆధారాలు చూపించొచ్చుగా?
X
బట్ట కాల్చి మీద వేయటంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ అనుభవం అంతకంతకూ పెరిగిపోతోంది. తనకు తోచిన అభాండాల్ని వేసే చినబాబు.. తాను చెప్పే మాటలకు తగ్గ ఆధారాలు చూపకుండా.. సమాచారం ఉందని వ్యాఖ్యానించటంలో మతలబు ఏమిటన్నది ప్రశ్నగా మారింది. రోజుకు కూసింత బురద మీ మీద వేస్తాం.. మీరేమో దాన్ని తుడుచుకోండన్నట్లుగా టీడీపీ నేతల తీరు ఉందని చెప్పక తప్పదు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్.. తాడేపల్లి.. బెంగళూరులో ప్యాలెస్ లు ఉన్నాయని.. తాజాగా చెన్నైలో మరో కొత్త ప్యాలెస్ కడుతున్నట్లుగా తమకు సమాచారం ఉందని లోకేశ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ప్యాలెసుల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవచ్చు కదా? అంటున్న లోకేశ్.. తన తండ్రిపవర్లో ఉన్నప్పుడు చేసిన లక్షల కోట్ల అప్పునకు.. వారి ఆస్తుల్ని ఎప్పుడైనా తాకట్టు పెట్టారా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా దెబ్బ తింటే.. వారిని ఆదుకునే విషయంలో జగన్ సర్కారుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. లోకేశ్ మాటల్ని చూస్తే.. ఒకదానికి మరొకటి పొంతన లేనట్లుగా ఉందని చెప్పాలి. ఎవరైనా ప్రముఖుడి మీద ఆరోపణలు చేసే ముందు కాస్త క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ సీఎం జగన్ కొత్త ప్యాలెస్ ను చెన్నైలో కడుతుంటే.. దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తూ ఆరోపణలు చేస్తే అర్థం ఉంటుంది. అందుకు భిన్నంగా ఉత్త మాటలు చెప్పటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. చెన్నైలో సీఎం జగన్ కు ప్యాలెస్ ఉండి ఉంటే.. ఆ ఆధారాల్ని చూపిస్తే బాగుండేది. అందుకు భిన్నంగా ఉత్త మాటలతో సరిపెట్టటం ఏ మాత్రం సరికాదంటున్నారు.