Begin typing your search above and press return to search.

కాస్ట్ పాలిటిక్స్ లో చంద్రబాబు వెనుకబడిపోయారు!

By:  Tupaki Desk   |   11 Aug 2019 7:23 AM GMT
కాస్ట్ పాలిటిక్స్ లో చంద్రబాబు వెనుకబడిపోయారు!
X
అయిదేళ్ల పాలనకే ప్రజా వ్యతిరేకత.. అభివృద్ధి పనులు చేస్తున్నా ఆదరించని జనం.. ఉద్యోగులు - రైతులు - మహిళలు - యువత.. ఇలా ప్రతి వర్గాన్నీ గుర్తించి మరీ ఇంతకుముందెప్పుడూ లేని స్థాయిలో బెనిఫిట్స్ చూపించినా నమ్మని జనం.. మరీ దారుణంగా 23 సీట్లకే పరిమితం చేయడం... ఇదంతా మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనం కొట్టిన దెబ్బ గురించేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా ఇదే అర్థం కాక తలపట్టుకుంటున్నారు. ‘ఐదేళ్లు ఇంత చాకిరీ చేసినా ఓడిపోవడం, మరీ ఘోరంగా 23 సీట్లే రావడం ఏమిటో అర్థం కావడం లేదు’ అంటూ టీడీపీ నేతలూ ఒక విధమైన ఎక్స్‌ ప్రెషన్ ఇస్తున్నారు.

అయితే, పథకాలు.. ప్రయోజనాలు ఎన్నున్నా కూడా టీడీపీ దెబ్బయిపోవడానికి ప్రధాన కారణం కులమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ‘సోషల్‌ ఇంజనీరింగ్‌’లో ఈసారి టీడీపీ విఫలమైందని.. అందుకే ఈ దారుణ ఓటమి అని చెబుతున్నారు. పోలింగ్ - ఫలితాలకు మధ్య సీఎస్డీఎస్-లోక్‌ నీతి సర్వీ కూడా ఇదే విషయం చెప్పింది. 2014 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలోని సామాజిక వర్గాల్లో వచ్చిన మార్పు వైసీపీ ఘన విజయానికి కారణమైందని ఈ సర్వే తేల్చింది. ఏఏ కులాలను టీడీపీ చేరుకోలేకపోయింది.. వారి ఆదరణ పొందలేకపోయిందన్నది కూడా విశ్లేషించింది. అదేసమయంలో వైసీపీ ఎక్కడ ముందడుగు వేసిందన్నది కూడా విశ్లేషించింది. వైసీపీ ఓట్లుగా చెప్పే రెడ్డి - మాదిగ - క్రైస్తవ వర్గాల ఓట్లను చెక్కుచెదరకుండా ఆ పార్టీ నిలబెట్టుకుంది. దాంతో పాటు గిరిజన నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరిగి అక్కడా టీడీపీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడంలో వైసీపీ సఫలమైంది. టీడీపీకి పట్టుందని భావించే బీసీల్లోనూ బలం పెంచుకోవడంతో పాటు చివరికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లనూ వైసీపీ తనవైపు తిప్పుకోగలిగింది.

మరోవైపు టీడీపీ కాపుల ఓట్ల కోసం ప్రయత్నాలు చేయడం వల్ల తనకు మొదటి నుంచి కాపు కాసే బీసీ ఓట్లను పోగొట్టుకుంది. కేంద్రంలోని బీజేపీని నేరుగా వ్యతిరేకించి ముస్లింల ఓట్లు కొంతవరకు సంపాదించగలిగినా పోగొట్టుకున్న ఇతర వర్గాల ఓట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం.. కొన్ని నియోజకవర్గాలకే ఆ ఓట్లు పరిమితం కావడంతో టీడీపీ దారుణంగా దెబ్బతిని 23 సీట్లకే పరిమితమైంది.

ఇక పింఛన్ల మొత్తాలు పెంచడం - పసుపు కుంకుమల పేరుతో మహిళలకు డబ్బులివ్వడం చేసినా ఫలితం రాకపోవడానికీ కారణం ఉంది. చంద్రబాబు వీటిని ప్రకటించి అమలు చేసినప్పటికే ఆలస్యమైపోయింది. వైసీపీ నవరత్నాలు ప్రజల్లోకి చొచ్చుకుపోవడంతో జగన్ సీఎం అయితే తమకు బాగా లబ్ధి జరుగుతుందన్న ఆశ అన్ని వర్గాల్లో ఏర్పడి అప్పటికే వారు జగన్‌ కు ఓటేయాలని ఫిక్సయిపోయారు. పైగా.. చంద్రబాబే ఈ స్థాయిలో ఇస్తే జగన్ దీనికంటే ఇంకా ఎక్కువే ఇస్తారంటూ వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీంతో చంద్రబాబు ఇచ్చిన తాయిలాల కంటే జగన్ ఇవ్వబోయే తాయిలాలే ఓటర్లను ఆకర్షించాయి.

ఇక నిరుద్యోగ భృతి - అన్న క్యాంటీన్లు వంటి పథకాలున్నా కూడా అవీ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతికి అనేక నిబంధనలు ఉండడం.. పైగా కుర్రకారులో అప్పటికే జగన్‌ పై - జనసేనపై క్రేజ్ ఉండడంతో ఆ లబ్దిదారుల ఓట్లూ టీడీపీకి పూర్తిగా పడలేదు. ఇక అన్న క్యాంటీన్లను తీసుకుంటే ఆ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువమంది స్థిర లబ్ధిదారులు కారు. వారంతా పాసింగ్ బెనిఫిషియరీస్ మాత్రమే. దీంతో అది పెద్దగా ఓట్లను అందివ్వలేకపోయింది.

ముఖ్యంగా గ్రామాల్లో వైసీపీ బాగా డామినేట్ చేయడంతో ఆ గ్యాప్‌ను టీడీపీ పట్టణాల్లో కవర్ చేసుకోలేకపోయింది. గ్రామాల్లో వైసీపీకి 56 శాతం ఓట్లు రాగా.. టీడీపీకి 37 శాతం ఓట్లొచ్చాయి. ఇక పట్టణాల్లో టీడీపీకి 44శాతం - వైసీపీకి 35 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, గ్రామీణ ప్రాంతమే రాష్ట్రంలో ఎక్కువ కావడంతో వైసీపీకి లాభించింది.

2014 ఎన్నికలను చూసుకుంటే ఏపీలో రెడ్డి - ఎస్సీ - ముస్లిం - క్రిస్టియన్ ఓటర్లు తప్ప మిగతా ఎవరూ వైసీపీకి ఎక్కువగా ఓటేయలేదు. ఆ ఎన్నికల్లో రెడ్డి ఓటర్లలో 64 శాతం వైసీపీకి - 30 శాతం టీడీపీకి.. ఎస్సీల్లో 57 శాతం వైసీపీ - 28 శాతం టీడీపీ. ముస్లింల్లో 66 శాతం వైసీపీ - 33 శాతం టీడీపీకి వేయగా.. క్రిస్టియన్లలో 69 శాతం వైసీపీ - 27 శాతం టీడీపీకి వేశారు.

అయితే.. కమ్మ ఓటర్లులో 72 శాతం - కాపుల్లో 49 శాతం - బీసీల్లో 54 శాతం - మిగతా అగ్రవర్ణాల్లో 56 శాతం మంది టీడీపీ - బీజేపీ - జనసేన కూటమికి ఓట్లేశారు. దాంతో ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. కానీ.. 2019 ఎన్నికలకు వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గం మినహా ఇంకెవరూ టీడీపీకి సోలిడ్‌ గా ఓటేయకపోవడంతో చంద్రబాబు పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.