Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఆర్ కాంగ్రెస్ షరతు అదేనా!

By:  Tupaki Desk   |   11 May 2019 5:11 PM IST
కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఆర్ కాంగ్రెస్ షరతు అదేనా!
X
కేంద్రంలో ఎటు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. ఇందు కోసం బోలెడన్ని పార్టీల ముందు జోలె పట్టడానికి కూడా కాంగ్రెస్ వెనుకాడేలా లేదు. తమకు గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ ఎంపీ సీట్లు రావడం ఖాయమనే అంచనాలతో ఉంది కాంగ్రెస్. ఇదే సమయంలో ఎన్డీయే రూపంలో కూడా బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కదని.. అలాంటి పరిణామాల మధ్యన ప్రాంతీయ పార్టీలు కీలక పాత్రను పోషించే అవకాశం ఉందని కాంగ్రెస్ కూడా ఒక అంచనాకు వచ్చింది.

ఆ మేరకు వివిధ ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమతో విబేధించి బయటకు వెళ్లిన వారిని కూడా కాంగ్రెస్ ప్రాధేయపడటానికి రెడీ అవుతోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తో కూడా కాంగ్రెస్ వాళ్లు ఈ మేరకు చర్చలు జరిపే ప్రయత్నం సాగిస్తున్నట్టుగా సమాచారం.

జగన్ ను కలుపుకునిపోయి.. ప్రభుత్వ ఏర్పాటులో కలిసి రావాలని అడగడానికి కాంగ్రెస్ రెడీ అయినట్టే. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయని సమాచారం. అయితే ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రెండు షరతులు పెడుతూ ఉందని టాక్.

అందులో ఒకటి ఏపీకి ప్రత్యేక హోదా. హోదా ఇచ్చిన వారికే కేంద్రంలో మద్దతు అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాబట్టి ఆ మేరకు హోదాను ప్రకటించాలి. దానికి కాంగ్రెస్ సై అంటోంది.

రెండో షరతు మాత్రం ఆసక్తిదాయకంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు ఆ కూటమిలో ఉండకూడదు అనేది! తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పై వైఎస్సార్సీపీ వెర్షన్ ఏమిటో అందరికీ తెలిసిందే.కేంద్రంలో కాంగ్రెస్ కూటమికి తాము మద్దతును ఇవ్వాలన్నా… చంద్రబాబు ఆ దరిదాపుల్లో ఉండకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షరతు పెడుతున్నట్టుగా సమాచారం.

మరి ఈ షరతుకు కాంగ్రెస్ ఓకే అంటుందా, అనదా..అనే దానికి ఫలితాలే సమాధానం ఇస్తాయి. ఒకవేళ టీడీపీ మరీ తక్కువ ఎంపీ సీట్లను నెగ్గితే కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబును పక్కన పెట్టడానికి పెద్దగా వెనుకాడకపోవచ్చు! ఈ ప్రశ్నలన్నింటికీ మే ఇరవై మూడునే సమాధానం లభిస్తుంది.