Begin typing your search above and press return to search.

దిల్లీలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ

By:  Tupaki Desk   |   8 April 2018 8:55 PM IST
దిల్లీలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ
X
దిల్లీ వేదిక‌గా వైసీపీ ఎంపీలు చేప‌ట్టిన ఆమ‌ర‌ణ దీక్ష‌లు స్ఫూర్తిదాయ‌కంగా సాగుతున్నాయి. ఏపీకి చెందిన‌వారే కాకుండా దిల్లీలోని తెలుగు ప్ర‌జ‌లు కూడా దీక్ష వ‌ద్ద‌కు వ‌చ్చి సంఘీభావం ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ నేత‌లు, దిల్లీలోని వైసీపీ అభిమానులు ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్య‌లీ నిర్వ‌హించారు. ర్యాలీలో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి - మాజీ ఎంపీ అనంత వెంక‌ట‌రామిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. వారి వెంట‌ పెద్ద‌సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు ర్యాలీగా సాగారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అంటూ నినదించారు. రాష్టానికి హోదా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కాగా ఆదివారం వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ దీక్ష‌ల వ‌ద్ద‌కు వ‌చ్చి ఎంపీల‌ను ప‌రామ‌ర్శించారు. విజ‌య‌మ్మ రాక‌తో దీక్ష‌ల్లో ఉన్న ఎంపీల‌కు మ‌రింత ఆత్మ స్థైర్యం క‌లిగిన‌ట్ల‌యింది. అయితే, ఆరోగ్యం క్షీణించడంతో అయిదుగురు ఎంపీల్లో మేక‌పాటి - వ‌ర‌ప్ర‌సాద‌రావుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారిని ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంచారు.

మ‌రోవైపు వైసీపీ దీక్ష‌ల‌కు ఇత‌ర పార్టీల నేత‌ల నుంచి కూడా మ‌ద్ద‌తు దొరుకుతోంది. సీపీఐ నేత డి.రాజా కూడా ఆదివారం దీక్ష‌ల వ‌ద్ద‌కు వ‌చ్చి సంఘీభావం తెలిపారు. అటు ఏపీలోనూ ఎంపీల​ దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేశారు. వంటావార్పు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.