Begin typing your search above and press return to search.

వేదవ్యాస్ సైకిల్ ఎక్కటం పక్కానా?

By:  Tupaki Desk   |   14 Oct 2016 7:30 AM GMT
వేదవ్యాస్ సైకిల్ ఎక్కటం పక్కానా?
X
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుల్లో ఒకరైన బూరగడ్డ వేదవ్యాస్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల్లో పెద్ద యాక్టివ్ గా లేని ఆయన అప్పుడప్పడు ఒకట్రెండు కార్యక్రమాలు మినహా పెద్దగా పాల్గొన్నది లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేదవ్యాస్... తాజాగా పార్టీ మారాలన్న అంశంపై తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎలాంటి పదవి లేనప్పటికీ.. ప్రజల్లో బలమైన గుర్తింపు ఉన్న వేదవ్యాస్ జగన్ గూటి నుంచి బయటకు వచ్చేసి.. సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కు.. వేదవ్యాస్ కుమారుడు కిషన్ తేజ్ కు మధ్యనున్న ఫ్రెండ్ షిప్ తో.. తాజాగా టీడీపీలో చేరేందుకు వేదవ్యాస్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఆయన టీడీపీలోకి రావాల్సి ఉంది. కానీ.. అలాంటిది చోటు చేసుకోకుండా.. జగన్ పార్టీ తరఫున పెడన నుంచి పోటీ చేసిన ఆయన.. కాగిత వెంకట్రావు చేతిలో ఓటమి పాలయ్యారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉన్న వేదవ్యాస్.. కొద్దికాలం పాటు డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. వైఎస్ మరణం తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన.. అనంతరం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలో టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెడన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన.. ఎన్నికల్లో ఓడిన తర్వాత నుంచీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండటం లేదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లే తాజాగా పార్టీ ముఖ్యులతో.. తన సన్నిహతులతో సమావేశాల్ని ఏర్పాటు చేస్తున్న వేదవ్యాస్.. సైకిల్ ఎక్కేందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/