Begin typing your search above and press return to search.

గణేష్ ఫెస్టివెల్ చిచ్చు: ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ

By:  Tupaki Desk   |   5 Sept 2021 6:00 PM IST
గణేష్ ఫెస్టివెల్ చిచ్చు: ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ
X
ఏపీలో మరో వివాదం రాజుకుంది. మరో ఐదురోజుల్లో ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు కేంద్రంగా పార్టీల మధ్య సెగలు పొగలు కక్కుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేయాలా? వద్దా ? అనేది ఏపీని రాజకీయంగా కూడా హీటెక్కిస్తున్న టాపిక్ ఇదీ..

దేశంలో థర్డ్ వేవ్ భయాలు ఉన్న నేపథ్యంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించకపోవడమే బెటర్ అన్నది అటు ఏపీలో ప్రభుత్వం భావిస్తోంది. కానీ నిర్వహించి తీరుతామని ఏపీ బీజేపీ పోరుబాటు పడుతోంది. ఈ ఫెస్టివెల్ ఫైట్ ఇప్పుడు వైసీపీ, బీజేపీ మధ్య యమ రంజుగా సాగుతోంది.

వినాయక చవితి అంటే దేశమంతా ఓ పెద్ద పండుగ. లక్షల్లో మండపాలు, కోట్ల మంది భక్తుల ఆరాధనలు ఉంటాయి. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయకచవితి జరుపుతారు. ఇక ఆ నిమజ్జనం సందడి వేరు. దేశమంతా ఈ పండుగ కోసం ఎదురుచూస్తోంది. కానీ కరోనా విజృంభిస్తున్న వేళ రెండేళ్లు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇంటికే పరిమితమయ్యాయి. బయట ఎవరూ పెట్టడం లేదు.

ఈసారైనా పండుగను ఘనంగా నిర్వహించాలని ప్రజలు, పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కానీ థర్డ్ వేవ్ ప్రబలుతుంది వద్దు అని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కరోనా మళ్లీ పుంజుకుంటుందని.. సామూహిక పండుగల సీజన్ లో జాగ్రత్తగా ఉండాలని రిపోర్ట్ ఇచ్చింది. దీంతో జగన్ సర్కార్ సమీక్షించి వేడుకలపై ఆంక్షలు విధించింది.

ఈ ఆదేశాలపై ఏపీ బీజేపీ మండిపడుతోంది. ఏపీలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం గంటల వరకు కర్ఫ్యూ కంటిన్యూ అవుతుదని.. అందుకే ఇళ్లకే చవితి వేడుకలు పరిమితం చేయాలని.. పబ్లిక్ స్థలాల్లో వేడుకలు వద్దని ఏపీ ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వడం లేదు.

ఏపీ బీజేపీ దీనిపై మండిపడుతోంది. ఏ పండుగకూ లేని ఆంక్షలు ఈ పండుగలకు ఎందుకు అని ప్రశ్నిస్తోంది. స్కూళ్లు తెరిచారని..పిల్లలను పంపిస్తున్నారని..వర్థంతి కార్యక్రమాలు చేశారని.. గుడ్ ఫ్రైడే, మొహర్రం కూడా నిర్వహించారని.. మరి గణేష్ పండుగకు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. వేడుకలపై ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత సత్యకుమార్ విరుచుకుపడ్డారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు ఏపీ బీజేపీ వర్సెస్ వైసీపీగా మారింది.