Begin typing your search above and press return to search.

ఆమరణ దీక్ష- తొలి పరీక్షలో వైసీపీ ఎంపీలు పాస్

By:  Tupaki Desk   |   6 April 2018 5:30 PM GMT
ఆమరణ దీక్ష- తొలి పరీక్షలో వైసీపీ ఎంపీలు పాస్
X
టీడీపీ గుండెల్లో రాయి పడేలా, కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడేలా వైసీపీ ఎంపీలు దిల్లీలో ప్రారంభించిన ఆమరణ దీక్ష ఉద్యమ స్ఫూర్తితో సాగుతోంది. దిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో దీక్ష చేపట్టిన ఎంపీలు తమ లక్ష్యం కోసం, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించడం కోసం ఎంతటికైనా సిద్ధమని.. ఆ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా వెరవబోమని తొలి రోజునే నిరూపించారు. ఎలాంటి కఠిన పరీక్షలు ఎదురైనా తాము మడమ తిప్పేది లేదని ప్రకృతి సాక్షిగా రుజువు చేశారు.

అవును... వైసీపీ ఎంపీల దీక్ష తొలి రోజున సాయంత్రం దిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం రాగా ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. ఎంపీల దీక్షా శిబిరం కూలిపోయింది. అయినా ఎంపీలు రాజమోహనరెడ్డి - వైవీ సుబ్బారెడ్డి - వరప్రసాద్ - మిథున్ రెడ్డి - అవినాశ్ రెడ్డిలు ఏమాత్రం చలించలేదు. గాలులు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందేమోనని కొద్దిసేపు ఎదురుచూశారు. టెంట్లు ఎగిరిపోయినప్పటికీ వర్షంలో తడుస్తూ హోరున వీస్తున్న గాలిలో అక్కడే కొద్దిసేపు ఉన్నారు. అయితే.. అక్కడున్న ఇతర నాయకులు, ఏపీ భవన్ సిబ్బంది అంతా వచ్చి ఆరుబయట కాకుండా భవనం అరుగుపైకి రావాలని వారిని కోరడంతో ఎంపీలు అందుకు అంగీకరించారు.

ముందు ఏర్పాటు చేసుకున్న దీక్షా శిబిరం కూలిపోవడంతో మళ్లీ దాన్ని పునరుద్ధిరించేలోగా తమ దీక్షను భవనం ముంగిలిలో కొనసాగించేందుకు నిర్ణయించారు. తొలి రోజున ఎదురైన ఈ పరిస్థితులు తమ పట్టుదలను మరింత పెంచాయని.. తమకు ప్రత్యేక హోదాను తప్ప ఇంక దేన్నీ పట్టించుకోబోమని.. ఎండ, వర్షం వంటివి తమనేవీ చేయలేవని ఎంపీలు అంటున్నారు.

కాగా ఎంపీల దీక్షలో చిత్తశుద్ధి లేదంటూ పాలక టీడీపీ ఆరోపణలు చేస్తున్న క్రమంలో తొలి రోజునే దాన్ని తిప్పి కొట్టేలా వైసీపీ ఎంపీలు ఇలా దీక్షను కొనసాగించడంలో వారి పట్టుదల, చిత్తశుద్ధి రెండూ కనిపిస్తున్నాయని అంటున్నారు. వైసీపీ ఎంపీలు తమ దీక్షా క్రమంలో తొలి పరీక్షను నెగ్గినట్లేనని చెప్తున్నారు.