Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ముద్ర‌!

By:  Tupaki Desk   |   25 Nov 2018 8:31 AM GMT
తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ముద్ర‌!
X
అదేంటి? జ‌గ‌న్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో పోటీ చేయట్లేదు క‌దా..! మ‌రి ఆయ‌న ప్ర‌జా కూట‌మిని ఓడించ‌డ‌మేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు అలాగే ఉన్నాయి మ‌రి. తెలంగాణ‌లో పోటీకి వైసీపీ దూరంగా ఉన్నా.. జ‌గ‌న్ ముద్ర మాత్రం ఇక్క‌డి ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి తెలంగాణ‌లోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. రాజ‌న్న‌గా ఆయ‌న్ను తెలంగాణ ప్ర‌జ‌లు ముద్దుగా పిలుచుకుంటారు. రాజ‌న్న కొడుకుగా జ‌గన్‌ను అభిమానించేవారూ అధిక సంఖ్య‌లోనే ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం అనంత‌రం కొన్నాళ్లు తెలంగాణ‌లోనూ పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టిన జ‌గ‌న్‌.. క్ర‌మంగా ఏపీ రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

అయితే - ఆయ‌నంటే అభిమాన‌మున్న‌వారు ఇప్ప‌టికీ తెలంగాణ‌లో భారీగానే ఉన్నారు. వైసీపీ రాష్ట్రంలో పోటీకి దూరంగా ఉండ‌టంతో వారు ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఓటెయ్యాల‌నే సందిగ్ధంలో ప‌డ్డారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ ప్ర‌జా కూట‌మిలో చేరింది. దీంతో జ‌గ‌న్ అభిమానుల‌కు ఓ క్లారిటీ వ‌చ్చేసింది. జ‌గ‌న్‌కు ప్ర‌త్య‌ర్థిగా భావించే చంద్ర‌బాబుకు ఏమాత్రం ప్రయోజ‌నం క‌లిగించ‌కూడ‌ద‌ని వారు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీకే కాదు.. ప్ర‌జా కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్షాలైన కాంగ్రెస్‌, సీపీఐ, తెలంగాణ జ‌న స‌మితిల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓటు వెయ్య‌కూడ‌ద‌ని వారంతా నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

జ‌గ‌న్ లేడు. ప్ర‌జా కూట‌మికి ఓటెయ్య‌రు. కాబట్టి ఇక జ‌గ‌న్ అభిమానులంతా చూస్తోంది టీఆర్ఎస్‌, బీజేపీల వైపే. ఆ రెండు పార్టీల్లో త‌మ‌కు న‌చ్చిన పార్టీకి ఈ ఎన్నిక‌ల్లో ఓటెయ్య‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కాబ‌ట్టి తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ముద్ర స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాను స్వ‌యంగా బ‌రిలోకి దిగ‌కపోయిన‌ప్ప‌టికీ ప్ర‌జా కూట‌మి విజ‌యావ‌కాశాల‌ను ఆయ‌న బాగానే దెబ్బ‌కొడుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో లేక‌పోవ‌డం కూడా ప్ర‌జా కూట‌మికి ఎదురుదెబ్బేన‌ని తెలుస్తోంది. జ‌న‌సేన‌ పోటీ చేయ‌క‌పోవ‌డంతో కాపు ఓట్లు ప్ర‌జా కూట‌మికి దూర‌మ‌వుతున్న‌ట్లు విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌న్న తమ నిర్ణ‌యాల‌తో జ‌గ‌న్‌, ప‌వ‌న్ ప్ర‌జా కూట‌మిని దెబ్బ‌తీసి టీఆర్ఎస్ గెలుపుకు బాట‌లు ప‌రిచిన‌ట్ల‌వుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.