Begin typing your search above and press return to search.

పొరుగు రాష్ట్రానికి వివేకా కేసు....... ఏపీ పరువు గంగలో కలిసింది

By:  Tupaki Desk   |   30 Nov 2022 8:38 AM GMT
పొరుగు రాష్ట్రానికి వివేకా కేసు....... ఏపీ పరువు గంగలో కలిసింది
X
ఏపీ పరువు మొత్తం గంగలో కలిసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మూడున్నరేళ్ళుగా ఏపీలో నత్తనడకగా సాగుతోంది. ఇంత సుదీర్ఘ కాలం అయినా నిందితులు ఎవరో తెలియలేదు, కేసు ఒక కొలిక్కి రాలేదు. ఆఖరుకు వివేకా కుటుంబీకులు ఏపీలో అయితే మాకు న్యాయం జరగదు అని భావించి సుప్రీం కోర్టు లో వేసిన పిటిషన్ ఆధారంగా చేసుకుని అత్యున్నత న్యాయం స్థానం ఇచ్చిన తీర్పు ఏపీ సర్కార్ కే కాదు పోలీసులకు అప్రతిష్టను తెచ్చింది అని అంటున్నారు.

ఏపీకి చెందిన ఈ కేసుని పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణా కు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసు విషయంలో వైఫల్యం ఎవరీది అన్న దాని మీద చర్చ సాగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా ఏమీ అనామకుడు కాదు, తానుగా ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వారు. ఒక దివంగత ముఖ్యమంత్రి తెలుగు నాట ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వైఎస్సార్ కి తమ్ముడు. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కి స్వయాన చిన్నాన్న.

అలాంటి ఆయన కేసుకే దిక్కూ దివాణం లేకుండా పోయిందా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో కొడుకు రాజ్యం నడుస్తోంది. చిన్నాన్న దారుణ హత్య కేసుని ఎందుకు మూడున్నరేళ్ళుగా చేదించలేకపోయారు యావత్తూ దేశం అనుకుంటోంది అంటే దీనికి జవాబు ఎవరు చెబుతారు అనేది ప్రశ్న. ఇక ఈ కేసు విషయంలో స్థానిక పోలీసుల వత్తిళ్ళు, ప్రభుత్వం నుంచి కూడా తెర వెనక వత్తిళ్ళు ఉన్నాయని అనుమానాల మీదనే వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఏపీలో న్యాయం జరగదు అంటూ పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన కొన్ని ఘాటైన వ్యాఖ్యలను బట్టి చూస్తే తలవంపులు ఏపీకే అనిపించకమానదు అంటున్నారు. కుట్ర కోణం దాగుందని, అలాగే సాక్ష్యాలను ద్వంస రచన సాగిందని కూడా అభిప్రాయపడినట్లుగా వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి మృతుని కుమార్తె, భర్యకు ఉన్న ప్రాధమిక హక్కులను దృష్టిలో ఉంచుకుని బదిలీ చేస్తున్నట్లుగా అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది అని తెలుస్తోంది.

అలాగే ఈ కేసులో ఏపీలో అయితే తమకు తగిన న్యాయం జరగదు అని వారు భావించడాన్ని అత్యున్నత న్యాయ స్థానం పరిగణలోకి తీసుకుని తెలంగాణా సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. ఇదిలా ఉండగా ఉమ్మడి ఏపీలో ఎపుడూ ఇలాంటి ఘటన జరగలేదు. ఒక రాష్ట్రంలో జరిగిన సంఘటన ఎంత పెద్దది అయినా అదే రాష్ట్రంలో కేసుని చేదించి నిందితులను బయటపెట్టిన చరిత్ర ఏపీ పోలీసులకు ఉంది.

మరి వివేకా కేసులో ఎందుకు ఇలా జరిగింది అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం నడిపే వారికి అంతంత దగ్గరి వారు దారుణ హత్యకు గురి అయితే ఆ కేసు తేలడానికి ఏళ్ళూ పూళ్ళూ పట్టాడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఈ కేసు విషయంలో ఏపీలో అయితే న్యాయం జరగదు అన్న నిర్ణయానికి వివేకా కుటుంబం రావడం అంటే అధికారంలో ఉన్న వారితో పాటు ఏపీలోని కీలక వ్యవస్థలకు కూడా నగుబాటే కదా అని అంటున్నారు.

దీని వల్ల ఏపీలో అద్వాన్న పరిస్థితులు ఎంతలా ఉన్నాయో కళ్లకు కట్టినట్లుగా తీర్పు వల్ల బయట ప్రపంచానికి తెలిసిందా అన్న చర్చ కూడా వస్తోంది. ఇది ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ పోలీస్ వ్యవస్థను సుప్రీం కోర్టు తీర్పు ద్వారా అభిశంసించడమే అని కూడా అంటున్నారు.

దీని వల్ల చట్టబద్ధమైన పాలన సాగడం లేదా లేక అధికారంలో ఉన్న వారు వ్యవస్థలు అన్నీ కలసి కుమ్మక్కై ప్రాధమిక హక్కులను కాలరాస్తున్నారా అన్న కొత్త చర్చకు కూడా ఆస్కారం ఏర్పడుతోంది అంటున్నారు. దీని వల్ల ఏపీ పరువు మొత్తం పోయింది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అదే విధంగా ఏపీ పోలీసుల ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లింది అని కూడా విమర్శిస్తున్నారు.

ఒకనాడు ఏపీ పోలీసు వ్యవస్థకు ఉన్న మంచి పేరు ఇపుడు పోయిందని, ప్రభుత్వం చెప్పినట్లుగా అధికారంలో ఉన్న వారు ఎలా చెబితే అలా చేస్తున్నారు అన్నదే జనసామాన్యంలో వెళ్ళిపోవడానికి సుప్రీం కోర్టు తీర్పు ఒక్కటి చాలు అని అంటున్నారు. ఇక ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చూస్తే వివేకా హత్య కేసులో సాక్ష్యులకు, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు ఏపీలో బెదిరింపులు ఎదురవుతున్నాయని, దాంతో అక్కడ నిష్పాక్షికంగా విచారణ దర్యాప్తు జరుగుతుంది అని తమకు అనిపించడంలేదు అని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అని కూడా అంటున్న వారు ఉన్నారు.

ఇక ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ సీబీఐ కూడా వివేకా హత్య కేసులో సాక్ష్యులకు నిందితుల నుంచి ప్రాణ హాని ఉందని సుప్రీం కోర్టుకు నివేదించిన పరిస్థితి ఉంది. ఇక దర్యాప్తు అధికారిని సైతం బెదిరించారు అని కూడా వారు పేర్కొన్నారు అంటే ఈ కేసులో ఎన్ని తెర వెనక జరిగాయో అని అంటున్న వారూ ఉన్నారు.

చాలా ఓపెన్ గా సీబీఐ సుప్రీం కోర్టులో ఈ కేసులో జరిగిన పరిస్థితిని వివరించారు అని చెబుతున్నారు. వివేకా హత్య కేసులో ఏపీ పోలీసులు కుమ్మక్కు అయ్యారని, అప్రూవర్ గా మారిన దస్తగిరి తన ప్రాణాలకు ముప్పు ఉందని మొరపెట్టుకున్నారని, సాక్ష్యులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని సీబీఐ పేర్కొంది అంటే ఈ కేసు విషయంలో చాలానే జరిగాయని అంటున్నారు. ఏది ఏమైనా చూస్తే సుప్రీం కోర్టు తీర్పు ద్వారా వివేకా హత్య కేసు పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. ఒక విధంగా ఏపీకి పరువు పోయింది అన్న మాటనే అంతా అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.