Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ యాత్ర కోసం విజ‌య‌మ్మ పిలుపు ఇదే

By:  Tupaki Desk   |   5 Nov 2017 6:06 PM GMT
జ‌గ‌న్ యాత్ర కోసం విజ‌య‌మ్మ పిలుపు ఇదే
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నేప‌థ్యంలో...వైసీపీతో పాటుగా అన్నివ‌ర్గాల్లోనూ ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని ఆ పార్టీ నేత‌లు చెప్తున్నారు. ఈ క్ర‌మంలో స‌హ‌జంగానే వైఎస్ కుటుంబ స‌భ్యులు పాద‌యాత్ర‌ను ఏ విధంగా భావిస్తున్నార‌నేది అన్ని వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో దివంగ‌త సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి స‌తీమ‌ణి, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజ‌య‌మ్మ స్పందించారు.

ఓ మీడియా సంస్థ‌తో వైఎస్ విజ‌య‌మ్మ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రను ప్రజల గుండెల్లో దాచుకొని.. ఆదరించారని గుర్తుచేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారని..ఇప్పుడు అలానే జగన్ ను ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. మీ కొడుకుగా, తమ్ముడిగా, మనవడిగా వైఎస్‌ జగన్‌ను అక్కున చేర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు వైఎస్సార్ అందించిన ప్రతి సంక్షేమ పథకం పాదయాత్ర నుంచి పుట్టిందేన‌ని, సంక్షేమ పథకాల బ్లూప్రింట్‌ను వైఎస్ పాదయాత్ర నుంచే తయారు చేసుకున్నారని చెప్పారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో అనేక మంది రైతులను, మహిళలను, వృద్ధులను కలిశారని వైఎస్ విజ‌య‌మ్మ గుర్తుకు చేసుకున్నారు. వైఎస్‌ చేసిన పాదయాత్రను ప్రజలు గుండెల్లో దాచుకొని, ఆయనను ఆదరించారని విజయమ్మ అన్నారు.అదే రీతిలో ఇప్పుడు వైఎస్‌ జగన్ చేస్తున్న పాదయాత్రను కూడా ఆదరించి, ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు. ప్రజా సంక్షేమం కోసం ఆయనకు బ్లూప్రింట్ ఇవ్వాలని అభ్యర్థించారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలు, సంక్షేమ పథకాల అమలు కోసమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టార‌ని...అందుకే ఆదరించాలని మరోసారి ఆమె అభ్యర్థించారు.

మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదని అందుకే వైఎస్ జగన్ పాదయాత్రను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారని విజ‌య‌మ్మ అన్నారు. పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఇందుకోసం అనుమ‌తులు అంటూ సాకులు వెదుకుతున్నార‌ని ఆక్షేపించారు. గతంలో చంద్రబాబు ఏ అనుమతితో పాదయాత్ర చేశారో చెప్పాలని విజయమ్మ నిలదీశారు. త‌న భ‌ర్త వైఎస్ రాజశేఖర రెడ్డి, త‌న‌య ష‌ర్మిల‌ పాదయాత్ర చూశానని, ఇప్పుడు జగన్ చేస్తున్నారని..పాదయాత్ర అంత సులభమైనది కాదని విజయమ్మ అన్నారు. తల్లిగా ఆయన పాదయాత్ర చేయడం తనకు బాధ, భారమేనని, కానీ తప్పనిద‌ని విజ‌య‌మ్మ అన్నారు. జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నానని తాను ఆ రోజే చెప్పానని గుర్తుచేసిన విజ‌య‌మ్మ జగన్‌కు ఒక్కసారి అవకాశమిచ్చి చూడాలని, అప్పుడు ఆయన తాను ప్రజలకు ఏం చేస్తారో చూడాలని కోరారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే చరిత్ర సృష్టించే పనులు చేస్తారని ధీమా వ్య‌క్తం చేస్తూ....పాద‌యాత్ర విజ‌య‌వంతం అవుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.