Begin typing your search above and press return to search.

షర్మిల స్విచ్ అక్కడ వేస్తే బల్బ్ ఏపీ లో వెలగాలా..?

By:  Tupaki Desk   |   17 March 2021 9:27 AM GMT
షర్మిల స్విచ్ అక్కడ వేస్తే బల్బ్ ఏపీ లో వెలగాలా..?
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోద‌రి వైఎస్‌. ష‌ర్మిల వ‌చ్చే నెల 9వ తేదీన కొత్త పార్టీ పెడుతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసేశారు. ఆమె కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న ఇప్పుడు తెలంగాణ‌ - ఏపీ రాజ‌కీయాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఏపీలో సోద‌రుడు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఇటు తెలంగాణ‌లో వైసీపీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా.. పార్టీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌క‌పోయినా ఆ పార్టీ శాఖ ఉంది.. దానికి అధ్య‌క్షులు.. జిల్లాల వారీగా నేత‌లు ఉన్నారు. మ‌రి అలాంట‌ప్పుడు ఏమాత్రం ప‌ట్టులేని తెలంగాణ‌లో ష‌ర్మిల కొత్త పార్టీ ఎందుకు? పెడుతున్న‌ట్టు ఆమె ఉద్దేశం ఏమిటి? అస‌లేం జ‌రుగుతోంద‌న్న‌ది మాత్రం ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. కొద్ది రోజులుగా ఆమె కొత్త పార్టీకి సంబంధించిన చ‌ర్చ‌లు అయితే న‌డుస్తున్నాయి. కొంద‌రు ఆమె బీజేపీకి బీ టీం అని.. మ‌రి కొంద‌రు ఆమె టీఆర్ ఎస్‌ కు బీ టీం అని విమ‌ర్శ‌లు చేస్తున్నా ఆమె మాత్రం తాను ఎవ్వరూ వ‌దిలిన బాణం కాద‌ని కొట్టి ప‌డేస్తూ వ‌స్తున్నారు.

ఇక తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో అత్యంత విశ్వ‌స‌నీయంగా న‌డుస్తోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం ష‌ర్మిల పార్టీ ఎన్నో రోజులు ఉండ‌ద‌నే అంటున్నారు. ఏపీలో అన్న అధికారంలోకి వ‌చ్చేందుకు తాను ఎంతో క‌ష్ట‌ప‌డితే త‌న‌ను ఎంత మాత్రం ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా? ఎలాంటి ప‌ద‌వి కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతోనే ష‌ర్మిల దంప‌తులు తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యి తెలంగాణ‌లో పార్టీ పెడుతున్న‌ట్టు చెపుతున్నారు. తెలంగాణ‌లో స్విచ్ వేస్తే ఎప్ప‌ట‌కి అయినా అన్న పిలుస్తాడ‌ని.. అక్క‌డ బల్ప్ వెలిగించే క్ర‌మంలోనే ఆమె తెలంగాణ‌లో కొత్త పార్టీ పేరుతో హ‌డావిడి చేస్తున్నార‌న్న సందేహాలు తెలంగాణ రాజ‌కీయాల్లో న‌డుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ‌లో ఉన్న ప‌రిస్థితుల్లో ఆమె ఇక్క‌డ 1 శాతం ఓట్లు కూడా చీల్చ‌ర‌నే అంటున్నారు.

జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు ష‌ర్మిల త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మితో క‌లిసి ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసి పార్టీకి ఘ‌న‌విజ‌యం సాధించి పెట్టారు. ఆ త‌ర్వాత ఆమె నాటి ఉమ్మ‌డి రాష్ట్రంలో సుధీర్ఘ‌మైన పాద‌యాత్ర చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ఓ మ‌హిళా నేత‌గా ఆమె న‌డిచిన కిలోమీట‌ర్లు ప్ర‌పంచంలోనే ఏ మ‌హిళా నేత కూడా న‌డ‌వ‌లేదు. ఈ విష‌యంలో ఆమె ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. 2014 ఎన్నిక‌ల్లో అంటే పార్టీ ఓడిపోయింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆమె ఒంగోలు ఎంపీ సీటు ఆశించినా జ‌గ‌న్ ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత ఆమె రాజ్య‌స‌భ‌పై ఆశ‌లు పెట్టుకున్నార‌నే పార్టీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ న‌డిచింది. వీలుంటే కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని కూడా లెక్క‌లు వేసుకున్నార‌ట‌.

అక్క‌డ కేంద్ర ప్ర‌భుత్వానికి ఎవ్వ‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేక‌పోవ‌డంతో ఇక్క‌డ వైసీపీ కూడా ఎన్డీయేలో చేర‌లేదు. అది అలా ఉంటే ష‌ర్మిల‌ను జ‌గ‌న్ ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే పార్టీ నేత‌ల్లో కొంద‌రు గుస‌గుస‌లాడుకుంటున్నారు. అందుకే ఆమె చాలా డేర్‌ గా తెలంగాణ‌లో పార్టీ ప్ర‌క‌ట‌న చేశారనే అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె తెలంగాణ‌లో పార్టీ పెట్టి చేసేదేం లేక‌పోయినా ఇక్క‌డ పార్టీ పెట్టి హ‌డావిడి చేస్తే.. రేప‌టి వేళ కేసీఆర్ అయినా జ‌గ‌న్‌ పై ఒత్తిడి చేస్తే అప్పుడు అయినా జ‌గ‌న్ ష‌ర్మిల‌కు ఏదో ఒక ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల్సి వ‌స్తుంద‌ని.. అందుకే ష‌ర్మిల కొత్త రూట్లో న‌రుక్కు వ‌చ్చే ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు.

ముందుగా ఆమె తెలంగాణ‌లో పార్టీ పెట్టినా రేప‌టి వేళ అన్న నుంచి పిలుపురాని ప‌క్షంలో ఆమె ఏపీ రాజ‌కీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వైసీపీ వాళ్లే సందేహిస్తున్నారు. ఏదేమైనా త‌న‌కు ఎలాంటి ప్ర‌యార్టీ లేక‌పోవ‌డంతోనే ష‌ర్మిల పార్టీ పెట్టారు అన్న‌ది వాస్త‌వం. మ‌రి ఆమె కొత్త పార్టీ ప్ర‌య‌త్నాలు ఎక్క‌డ స్టార్ట్ అయ్యి ఎటు న‌డిచి ఎక్క‌డ ఎండ్ అవుతాయో? ఎక్క‌డ స్విచ్ వేస్తే ఎక్క‌డ బ‌ల్పు వెలిగిస్తాయో? చూడాలి.