Begin typing your search above and press return to search.

లోక్‌ సభకు షర్మిల...?

By:  Tupaki Desk   |   19 Jan 2019 5:39 AM GMT
లోక్‌ సభకు షర్మిల...?
X
వైఎస్‌. షర్మిల. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశే‌ఖర రెడ్డి కుమార్తే. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన రెడ్డి సోదరి. రాజకీయాలకు దూరంగా ఉండే ఆమెను కొందరు టార్గెట్ చేసారు. సోషల్ మీడియాలో లేనిపోని పుకార్లతో ఆమెను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రారంభమయిన ఈ విక్రుత చేష్టలు ఇటీవల మళ్ళీ ప్రారంభమయ్యాయి. దీంతో షర్మిల పోలీసులను సైతం ఆశ్రయించారు. షర్మిలపై 12 వెబ్‌ సైట్లు అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇంత వరకూ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాని వైఎస్‌. షర్మిల తప్పుడు పోస్టుల ఘటనతో రాజకీయ ప్రవేశం చేయాలని దాని ద్వారా ప్రత్యర్దులకు గుణపాఠం చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో వచ్చే లోక్‌ సభ ఎన్నికలలో వైఎస్. షర్మిల - వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయమై వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన సోదారుడు వైఎస్‌ జగన్‌ తో కూడా చర్చించినట్లు సమాచారం.

గత ఎన్నికలలో వైఎస్‌ షర్మిల తల్లి వైఎస్‌ విజయమ్మ విశాఖపట్నం లోక్‌ సభ స్దానానికి పోటీ చేసారు. ఈ సారి పోటీ చేసేందుకు ఆమె విముఖత చూపుతున్నారని అంటున్నారు. దీంతో విశాఖపట్నం నుంచి షర్మిలను లోక్‌ సభ అభ్యర్దిగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. పైగా గత ఎన్నికలలో గెలిచిన బిజేపీ అభ్యర్ది హరిబాబు పట్ల వ్యతిరేకత కూడా ఉంది - ఆ పార్టీ ఓట్లు కూడా షర్మిలకు బదలాయింపు జరిగే అవకాశం ఉందని అంచన వేస్తున్నారు. ఒకవేళ విశాఖపట్నం నుంచి పోటీ చేయకపోతే - అనంతపురం నుంచి లోక్‌ సభ స్దానానికి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి లోక్‌ సభ సభ్యుడిగా జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సారి ఆయనే తెలుగుదేశం అభ్యర్దిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవల వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పైన పార్టీ అధ్యక్షుడు జగన్‌ పైన జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వైఎస్ కుటుంబంపై కూడా జేసీ దివాకర్ రెడ్డి కక్ష పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయనపై తన సోదరి చేత పోటీ చేయించి ఓడించాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. దీనికి తోడు జేసీ దివాకర్ రెడ్డిపై అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. వారంత జేసీని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇది కూడా షర్మిల విజయానికి కలసి వస్తుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.