Begin typing your search above and press return to search.

నేను సునీత పక్షం...వివేకా హత్య చేసిన దోషులు బయటపడాల్సిందే...

By:  Tupaki Desk   |   3 Dec 2022 11:30 PM GMT
నేను సునీత పక్షం...వివేకా హత్య చేసిన దోషులు బయటపడాల్సిందే...
X
ఏపీలో అత్యంత క్లిష్టమైన సంచలనమైన కేసుగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు ఉంది. ఈ హత్య కేసుని ఏపీ పరిధి నుంచి తెలంగాణాకు బదిలీ చేస్తూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇది అతి పెద్ద వివాదం అయింది కూడా. ఏపీ సర్కార్ పరువు పోయిందని, ఈ కేసుని సరిగ్గా డీల్ చేసి అసలైన నిందితులను పట్టుకోవడంతో వైసీపీ సర్కార్ విఫలం అయిందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

మరి దీని మీద వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఏమనుకుంటున్నారు. ఆమె రియాక్షన్ ఏమిటి అన్నది చూడాలి కదా. ఒక టీవీ చానల్ కి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల ఈ హత్య కేసు మీద కీలకమైన విషయాలు చేప్పారు. తాము సీబీఐకి ఈ కేసు విషయంలో వాంగ్మూలం ఇచ్చామని చెప్పారు. అయితే అది రివీల్ చేయనని తనకూ సీబీఐకి మధ్యన జరిగిన మ్యాటర్ అంటూ దాటవేశారు.

ఈ కేసు విషయంలో ఏపీ సర్కార్ పరువు పోలేదా అన్న దాని మీద కూడ షర్మిల ఆచీ తూచీ బదులిచ్చారు. ఏపీ సర్కార్ మీద నమ్మకం లేదు అని సునీత వేరే రాష్ట్రానికి కేసు బదిలీ కోరడంలో తప్పు లేదని, ఒక బాధితురాలిగా అది ఆమె హక్కు అలాగే డెసిషన్ అని అన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారు ఫలనా వారు అని ఆమె నమ్ముతోంది అని షర్మిల చెప్పారు. తాను ఆ హత్య కేసులో ఎవరు దోషులో తెలుసుకోవాలనుకుంటున్నానని, తనకు కనుక ముందే తెలిస్తే కచ్చితంగా చెప్పేదాన్ని అని ఆమె అన్నారు.

అందువల్ల ఎవరికీ ఈ హత్య కేసులో దోషులు ఎవరో తెలియదు, కాబట్టి సీబీఐ ఈ కేసుని సత్వరమే విచారణ చేసి అసలైన దోషులను బయటపెట్టాలన్నదే తన కోరిక అని ఆమె అన్నారు. తనను హైదరాబాద్ లో క్రేన్ సాయంతో కారుని తీసుకెళ్ళి మరీ అరెస్ట్ చేసిన సంఘటలో ఎంతో మంది సానుభూతి చూపిస్తూ తనకు అండగా మాట్లాడారని షర్మిల చెప్పారు. అయితే తన కుటుంబం నుంచి అన్న జగన్ మాట్లాడారా లేదా అన్నది ప్రధానం కాదని ప్రజలు ఎంతలా రియాక్ట్ అయ్యారన్నదే తనకు ముఖ్యమంటూ షర్మిల దాటవేయడం విశేషం.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రావని,షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీయార్ ఓడిపోవడం ఖాయమని షర్మిల అన్నారు. అదే సమయంలో ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నకు
తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది తనేనని ఆమె ధీమాగా చెప్పడమూ విశేషం. తాను మూడు వేల అయిదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఎవరికో చాకిరీ చేయడానికో ఏ పార్టీ కొమ్ము కాయడానికో కాదని, తానే సొంతంగా అధికారంలోకి రావాలి, వైఎస్సార్ పాలనను ప్రజలకు అందించాలన్నదే తమ లక్ష్యమని, దాన్ని తప్పక సాధిస్తాను అని ఆమె అన్నారు.

ఈ పాదయాత్ర ద్వారా తాను తెలంగాణా ప్రజలకు రాజన్న బిడ్డగా ఒక ఆల్టర్నేషన్ రాజకీయ పార్టీగా పరిచయం చేసుకోవడమే కాకుండా కనెక్ట్ అయ్యానని, ఇక తన ఓటు బ్యాంక్ ఎంతవరకూ ఏర్పడింది అన్నది చూస్తే అధికారం సాధించేందుకు అవసరమైనంత బలం మాత్రం తనకు ఉందని నమ్మకంగా చెప్పగలను అని ఆమె అంటున్నారు.

తనకు ఏ పార్టీతో పొత్తులు లేవని, అలాగే ఎవరూ తనకు మిత్రులు కారని ఆమె తెగేసి చెప్పారు. తాను పక్కా తెలంగాణా బిడ్డను అని ఇక్కడే చదివి ఇక్కడే నివాశం ఉంటున్నానని, ఇక్కడే తన భవిష్యత్తు అంతా చూస్తున్నాను అని ఆమె చెప్పారు. తనను నాన్ లోకల్ అన్న వారే ఆలోచించుకోవాలి తప్ప తాను మాత్రం తెలంగాణాను వీడిపోయే ప్రసక్తే లేదని అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.