Begin typing your search above and press return to search.

పార్టీ గుర్తింపు కోసం వైఎస్ షర్మిల కష్టాలు

By:  Tupaki Desk   |   27 Jan 2022 12:30 PM GMT
పార్టీ గుర్తింపు కోసం వైఎస్ షర్మిల కష్టాలు
X
రాజన్న రాజ్యం తెస్తానంటూ బయలు దేరిన వైఎస్ షర్మిల.. పార్టీ పెడుతానని చెప్పి దాదాపు ఏడాది అవుతోంది. 2021 ఫిబ్రవరి 9న హైదరాబాద్ లో కార్యకర్తలతో సమావేశం పెట్టి పార్టీ పెడుతున్నానని చెప్పిన ఆమె అప్పటికే ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశారు. జులై 9న అధికారికంగా సభ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేసి జెండా, అజెండా ప్రకటించారు. కానీ ఇప్పటికీ షర్మిల పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు మాత్రం పొందలేదు.

తెలంగాణలో అధికారం సాధించాలని కలలుగంటున్న షర్మిలకు ఎన్నికల సంఘం గుర్తింపు దక్కడం ప్రధానం. మొదట ఆమె తెలంగాణలో తన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు తెచ్చుకోవాల్సి ఉంటుంది.

షర్మిల పార్టీ పేరు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆమె పార్టీని గుర్తించవద్దని.. అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షేక్ భాషా ఢిల్లీలో కోర్టులో ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఎన్నికల సంఘానికి కూడా పార్టీకి గుర్తింపునివ్వడంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ పేరు మీద మరో పార్టీ వస్తేప్రజల్లో గందరగోళం నెలకొంటుందని ఆయన ఈసీకి వివరించారు.

అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈసీ షర్మిల పార్టీ గుర్తింపు గురించి పెద్దగా ముందుడుగు వేయడం లేదు. ప్రతి నెల కొన్ని ప్రశ్నలతో లెటర్లు మాత్రం రాస్తూ పార్టీ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడం లేదు. దీనిపై షర్మిల కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకొని ఏడాది అయినా ఇప్పటివరకూ గుర్తింపు ఇవ్వకుండా ఈసీ తాత్సారం చేయడం అర్థం కావడం లేదని అసంతృప్తితో ఉన్నారు.

దీనిపై నేరుగా ఈసీని అడగడమే కరెక్ట్ అని షర్మిల భావిస్తున్నారు. వైఎస్ఆర్ పేరుపెట్టుకుంటున్నాం కాబట్టి తన తల్లి, వైఎస్ఆర్ భార్య విజయలక్ష్మీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని సర్టిఫికెట్ ఇచ్చినా ఈసీకి ఇంకా ఏం అభ్యంతరమో అర్థం కావడం లేదంటూ వైఎస్ షర్మిల తన నిరసన తెలిపారు. ఈ విషయంలో తనపై కుట్ర కూడా ఉండొచ్చని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. గుర్తింపులేకుండా పార్టీ కార్యక్రమాలు ఎలా చేపట్టాలని కార్యకర్తలు నేతలు అయోమయంలో పడుతున్నారు.