Begin typing your search above and press return to search.

ఖమ్మం సభలో షర్మిల డ్రెస్సింగ్ వెనుక లెక్కలు ఉన్నాయా?

By:  Tupaki Desk   |   10 April 2021 6:32 AM GMT
ఖమ్మం సభలో షర్మిల డ్రెస్సింగ్ వెనుక లెక్కలు ఉన్నాయా?
X
ఒక రాజకీయ పార్టీ పెట్టటం అంత తేలికైన విషయం కాదు. పార్టీలు చాలానే ఉండొచ్చు. కానీ.. ప్రజలకు దగ్గరగా వెళ్లే పార్టీలు చాలా కొద్దిగానే ఉంటాయి. అందునా.. మహిళలు నిర్వహించే పార్టీలు వేళ్ల మీద లెక్కించే పరిస్థితి. దక్షిణాదిలో దివంగత అమ్మ తప్పించి.. మరెవరూ పార్టీ పగ్గాలు పట్టి నడిపించిన దాఖలాలు కనిపించవు.

ఉత్తరాదిలో బీఎస్పీ మాయావతి.. ఈశాన్యాన మమతా బెనర్జీ లాంటి కొందరు నేతలు మాత్రమే కనిపిస్తారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరిస్థితి భిన్నమని చెప్పాలి. గాంధీ కుటుంబం అనే బ్యాగేజీతో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. షర్మిల కూడా తన తండ్రి వైఎస్ బ్యాగేజీతోనే వచ్చినప్పటికీ.. ఆమె అంతకు ముందు చేసిన పాదయాత్రలు.. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనటం ద్వారా తనను తానునిరూపించుకున్నారనే చెప్పాలి.

పురుషాధిక్య కొట్టొచ్చినట్లుగా కనిపించే రాజకీయ రంగంలో ఒక మహిళ సొంతంగా పార్టీ పెట్టటం పెద్ద సాహసమే. ఇలాంటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. తెర వెనుక భారీ ప్లానింగ్ తో పాటు.. దీర్ఘకాలికంగా చేసిన హోంవర్కుకు తగ్గట్లే షర్మిల ప్రతి అడుగు వేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆమె డ్రెస్సింగ్ ఉందని చెప్పాలి. పసుపుపచ్చ చీరకు బ్లూ పట్టిని ధరించిన ఆమె.. రోటీన్ కు భిన్నమైన పద్దతిలో కనిపించారని చెప్పాలి. చూస్తుంటే.. ఈ రెండు రంగులకు ఆమె పార్టీలోనూ.. పార్టీ జెండాలోనూ ప్రాధాన్యత లభిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.

ఆమె డ్రెస్సింగ్ చూస్తే.. రోజువారీగా ఆమె వస్త్రధారణకు కాస్తంత భిన్నంగా ఖమ్మం సభ వేళ ఉందని చెప్పాలి. జయలలిత.. మమతాబెనర్జీ.. మాయావతి.. ఈ ముగ్గురు మహిళా నేతల్ని నిశితంగా పరిశీలిస్తే.. వారి వేషధారణ కూడా భిన్నంగా ఉంటుంది. ఎవరికి వారికి.. వారు అభిరుచులకు తగ్గట్లు వారి వస్త్రధారణ ఉంటుంది. తాజాగా షర్మిలను చూస్తే.. అదే విషయం స్పష్టమవుతుంది. ఖమ్మం సభకు ఆమె వస్త్రధారణను ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రానున్నరోజుల్లో ఇదే తీరులో ఆమె వస్త్రధారణ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.