Begin typing your search above and press return to search.

ఏపీలో కూడా పార్టీ పెట్టొచ్చు: వైఎస్ ష‌ర్మిల‌

By:  Tupaki Desk   |   3 Jan 2022 4:10 PM IST
ఏపీలో కూడా పార్టీ పెట్టొచ్చు: వైఎస్ ష‌ర్మిల‌
X
అన్న జ‌గ‌న్‌ తో విభేదాల కార‌ణంగా తెలంగాణ‌లో సొంతంగా పార్టీ పెట్టుకున్న వైఎస్ ష‌ర్మిల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనూ పార్టీ పెట్టే విష‌యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అన్న వ‌దిలిన బాణంగా 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఏపీలో వైసీపీ త‌ర‌పున ప్ర‌చారంలో కీల‌క పాత్ర పోషించిన ఆమె.. ఇప్పుడు అన్న‌పైకే రాజ‌కీయ బాణం ఎక్కుపెట్టేలా క‌నిపిస్తున్నారు. హైద‌రాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌ లో ఆమె చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ఈ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చేలా ఉన్నాయి.

ఏపీలో పార్టీ పెడ‌తారా? అని ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా రాజ‌కీయ పార్టీ ఎవ‌రైనా ఎక్క‌డైనా పెట్టొచ్చ‌ని ష‌ర్మిల చెప్పారు. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా త‌ప్పా అని ఎదురు ప్ర‌శ్నించారు. ఏపీలో తాను రాజ‌కీయ పార్టీ పెట్ట‌కూడ‌ద‌ని ఎక్క‌డా రూట్ లేద‌న్నారు. ప్ర‌స్తుతం తాను ఒక మార్గాన్ని ఎంచుకున్నాన‌ని అందులో న‌డుస్తున్నాన‌ని ఆమె పేర్కొన్నారు.

విలేక‌ర్ల‌తో ష‌ర్మిల వ్యాఖ్య‌లు చూస్తుంటే ఆమె ఏపీలో పార్టీ పెడ‌తార‌నే ప‌రోక్ష సంకేతాలు అందించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఏపీలో అన్న జ‌గ‌న్ పార్టీ ఉంది క‌దా.. తాను ఇక్క‌డ తెలంగాణ రాజ‌కీయాల‌నే చూసుకుంటాన‌ని ఆమె చెప్ప‌లేదు. ఎక్క‌డైనా పార్టీ పెట్టొచ్చు అని మాత్ర‌మే బ‌దులిచ్చింది.

దీంతో ఏపీలో వైఎస్ కుటుంబం నుంచి మ‌రో పార్టీ వ‌స్తుంద‌నే ప్ర‌చారానికి బ‌లం చేకూర్చిన‌ట్ల‌యింది. ఇటీవ‌ల వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ రాజు కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. త్వ‌ర‌లోనే ష‌ర్మిల ఏపీలో అడుగుపెడ‌తార‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ష‌ర్మిల మాట‌లు చూస్తుంటే అదే నిజ‌మ‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.

2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ విజ‌యం కోసం షర్మిల క‌ష్ట‌ప‌డింది. కానీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ష‌ర్మిలను ప‌ట్టించుకోలేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె తెలంగాణ‌లో జులై 8న త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అప్ప‌టి నుంచి పార్టీ బ‌లోపేతంపై పూర్తి దృష్టి సారించారు.

సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను ఓ వైపు విమ‌ర్శిస్తూనే.. ప్ర‌జా ప్ర‌స్థాన పాద‌యాత్ర‌, రైతు ఆవేద‌న యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్త‌న్నారు. అయితే ఆమె పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్‌, ష‌ర్మిల ఎదురుప‌డి మాట్లాడుకున్న‌ది లేదు. ఈ అన్నాచెల్లెలి మ‌ధ్య దూరం పెరిగింది. ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా కూడా ష‌ర్మిల క‌నీసం సోష‌ల్ మీడియాలోనూ శుభాకాంక్ష‌లు చెప్ప‌లేదు. క్రిస్మ‌స్ వేడుక‌ల్లోనూ ఎవ‌రి దారి వాళ్ల‌దే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు.