Begin typing your search above and press return to search.

వెలుగు క్లిప్ ను పట్టుకొని చెడామడా తిట్టేసిన షర్మిలక్క

By:  Tupaki Desk   |   14 May 2021 3:30 AM GMT
వెలుగు క్లిప్ ను పట్టుకొని చెడామడా తిట్టేసిన షర్మిలక్క
X
ఏమైనా చేయాలి.. ప్రజల్లో కనిపించాలి.. తన మాటలు వినిపించాలన్న ఉద్దేశం తప్పించి.. సమయం సందర్భం లేకుండా ఎంట్రీ ఇచ్చేయటంలో షర్మిల లెక్కనే వేరుగా ఉన్నది. తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టారో.. కేసీఆర్ కు ప్రత్యామ్నాయం తానేనని ఘంటాపథంగా చెప్పుకుంటూ.. అప్పుడెప్పుడో అరిగిపోయిన నిరుద్యోగ సమస్యను బయటకు తెచ్చి.. తెర మీదకు తీసుకొచ్చి.. దీక్ష చేసిన వేళలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అంత చేసినదానికి చివరకు.. తన చుట్టూ చేరినోళ్లలో ఎక్కువమందికి కోవిడ్ పాజిటివ్ లుగా తేలటంతో.. దీక్షను.. లోటస్ పాండ్ తలుపుల్ని మూసేయటం తెలిసిందే.

ఇప్పుడిప్పుడే.. కొవిడ్ తీవ్రత నుంచి బయటకు వచ్చారో లేదంటే.. మిగిలిన వారితో పోలిస్తే తాను వెనుకబడిపోయానని ఫీల్ అయ్యారో కానీ.. అనుకోని రీతిలో ట్విటర్ లో ట్వీట్లు చేసి మరీ ఎంట్రీ ఇచ్చారు షర్మిల. కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ.. తెలంగాణ ప్రజలు కష్టాల కడగండ్లలో కిందామీదా పడుతున్న వేళ.. దీనంతటికి మీరే కారణమంటూ తండ్రికొడుకులిద్దరిని ట్వీట్లతో ఉతికేసే ప్రోగ్రాంకు తెర తీశారు.

గతంలో తాను బయటకు తీసిన నిరోద్యోగుల ఉద్యోగాల భర్తీ విషయాన్ని తాజాగా ప్రస్తావించని ఆమె.. కోవిడ్ వేళ తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు పట్టటం లేదా? అంటూ విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ కళ్లు.. చెవులు మూసుకొని పాలన చేస్తున్నారని.. తండ్రీకొడుకులకు జనం పడే కష్టాలు కనిపించటం లేదని విమర్శించారు. ‘‘పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతుంది.. కేసీఆర్ గారు కళ్లు.. చెవులు మూసుకొని పరిపాలన చేస్తున్నారు. చిన్నసారు కేటీఆర్ గారికి కరోనా కష్టాలు కనిపిస్తలేవు.. వినిపిస్తలేవు.. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం జనం చాంతాడంత క్యూలు కట్టేది కనిపిస్తలేదు’’ అంటూ ఒక ట్వీట్ లో వీరావేశాన్ని ప్రదర్శించారు.

అక్కడితో ఆగని ఆమె.. అదే టెంపోను మొయింటైన్ చేస్తూ మరింతగా చెలరేగారు. విమర్శల వర్షం కురిపించారు. రూ.3500 ఇంజక్షన్ రూ.40వేలు పెట్టి కొంటున్నమన్న గగ్గోలు వినిపిస్తలేదు.. ఆక్సిజన్ లేక రోగులు చస్తుంటే.. నాకేం పట్టి అని చూస్తున్నరు. తండ్రికొడుకుల గారడి మాటలుపక్కన పెట్టి బెడ్లు.. ఆక్సిజన్.. వ్యాక్సిన్.. రెమిడివిసిర్ల కొరత ఉందని ఒప్పుకొని.. వాటిని ఎలా అందించాలో ఆలోచించండి’’ అంటూ తన డిమాండ్ల చిట్టాను ట్వీట్ తో వదిలారు. మరి.. దీనికి తండ్రికొడుకుల నుంచి సమాధానం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తన ట్వీట్లకు సాక్ష్యంగా రెమిడిసివర్ కోసం తిప్పలు అంటూ వెలుగులో వచ్చిన ఆర్టికల్.. అదే పత్రికలో రెమిడిసివర్ కొరత లేదంటూ కేటీఆర్ సమీక్ష పెట్టి తేల్చిన వార్తను పక్క పక్కనే పెట్టేసి పంచ్ లు వేశారు.